Budget 2025 Highlights:కేంద్ర బడ్జెట్ 2025తో నిర్మలమ్మ కొట్టిన సిక్స్‌ర్ ఇదే
Budget 2025 Highlights:వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. అనేక రంగాల వారిని ప్రోత్సహించేలా కేటాయింపులు వివరించారు.

Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి ఈ రోజు పార్లమెంటులో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనలు, అరుపుల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని ప్రస్తావించిన నిర్మల.. 'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ స్ఫూర్తితో దేశ ప్రజల మంచికోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు, ప్రైవేట్ రంగ అభివృద్ధిని ప్రోత్సహించే, వృద్ధిని పెంపొందించే, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా, వినియోగం, పెట్టుబడులను ప్రోత్సహించే మార్గాలను సీతారామన్ వివరించారు. ఈ బడ్జెట్ మహిళలు, రైతులు, పేదలు, యువతకు ప్రాధాన్యతనిస్తుందని, అభివృద్ధికి సంబంధించి 10 ప్రధాన వర్గాలను ఇది కవర్ చేస్తుందన్నారు. వీటితో పాటు బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలోని ప్రధాన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యతరగతి వారికి ఉపశమనం
మధ్యతరగతి ప్రజల వల్లనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ది చెందుతుంది. కాబట్టి వారి సహకారానికి గుర్తింపుగా వారు రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను చెల్లించకుండా రిబేట్ ప్రకటించారు. దీని వల్ల ఇప్పటివరకు ఉన్న విధానాలలో రూ. 80 వేల పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఈ ట్యాక్స్ రిబేట్ కారణంగా పన్ను చెల్లించాల్సిన అసవరం లేదు. ఈ న్యూ ఇన్‌కం ట్యాక్స్ బిల్లు వచ్చే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఆరు రంగాలలో మెరుగుదల:
- పట్టణాభివృద్ధి
- మైనింగ్
- పన్ను విధింపు
- విద్యుత్ పరిశ్రమ
- బ్యాంకింగ్ రంగం
- రెగ్యులేషన్స్
అదే ప్రభుత్వ లక్ష్యం
- వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే పదేళ్లలో 4 కోట్ల మంది ప్రజలకు చేరవేయడానికి, 120 కొత్త ప్రదేశాలకు ప్రాంతీయ కనెక్షన్‌లను మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ (UDAN) ప్రాజెక్ట్ ప్రవేశపెట్టనున్నారు.
- బీమా రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది.
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి
7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి ఉత్పత్తిదారులు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (KCC) ద్వారా స్వల్పకాలిక రుణాలును పొందుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
సీనియర్ సిటిజన్లకు ఉపశమనం (TDS)
- పన్ను మినహాయింపులలో (TDS) మార్పులను, సీనియర్ సిటిజన్‌లకు సహాయం చేయడంపైనా నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకురానున్నారు. '
- TDS, TCS రేట్ల తగ్గింపు ఉంటుందని, అలాగే అద్దె ఆదాయంపై టీడీఎస్ రూ.6 లక్షలకు పెంపు ఉండగా, వడ్డీ ఆదాయంపై రూ. 2లక్షలకు పెంపు ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
చౌకగా లభించనున్న EVలు, మొబైల్‌లు, మందులు
- క్యాన్సర్ మందులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ సుంకాలు తగ్గింపు.
- బంగారం, వెండి, ప్లాటినంపై సుంకాలు వరుసగా 6%, 6.4%, 6.4%కి తగ్గింపు.
- ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై సుంకాలు 10% నుండి 20%కి పెంపు
వీటితో పాటు ఐఐటీ, ఐఐఎస్ విద్యార్థులకు రూ.10వేల కోట్ల ఉపకార వేతనాలు, షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్, రూ.25వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు, పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు వంటివి ఈ సారి బడ్జెట్ లో చేర్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

