Geetika Srivastava: పాకిస్థాన్‌లో భారత హైకమిషన్ మిషన్ హెడ్‌గా గీతిక శ్రీవాత్సవ
Geetika Srivastava To Pakisthan: పాకిస్థాన్‌లో భారత హైకమిషన్ మిషన్ హెడ్‌గా గీతిక శ్రీవాత్సవ. తొలిసారిగా పాకిస్థాన్‌లో మిషన్ హెడ్‌గా ఓ మహిళ బాధ్యతలు తీసుకోబోతున్నారు.
పాకిస్థాన్‌లో భారత హైకమిషన్‌లోని మిషన్ హెడ్‌గా గీతిక శ్రీవాత్సవ నియమితులయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌లో మిషన్ హెడ్‌గా ఓ మహిళ బాధ్యతలు తీసుకోబోతున్నారు. గీతిక శ్రీవాత్సవ 2005 ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి. ఆమె ప్రస్తుతం ఎంఈఏ ఇండో పసిఫిక్ డివిజన్‌లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. కాగా ఇప్పుడు ఇస్లామాబాద్‌లో సీడీఏ(ఛార్జ్ డీఅఫైర్స్)గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న డా.ఎం సురేష్ కుమార్ దిల్లీకి తిరిగి వస్తున్న నేపథ్యంలో గీతికను ఆ పదవిలో నియమించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాలు హైకమిషనర్లను వెనక్కి తీసుకున్నారు. హైకమిషన్‌లకు సంబంధిత ఇంఛార్జిలుగా సీడీఏలను నియమిస్తున్నారు. వీరు జాయింట్ సెక్రటరీ ర్యాంకు అధికారులు. కాగా ఈ సీడీఏ పదవికి భారత ప్రభుత్వం మహిళా ఐఎఫ్‌ఎస్ అధికారిని ఎంపిక చేసుకున్నారు.
గీతిక శ్రీవాత్సర 2007-09 మధ్యకాలంలో చైనాలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. అలాగే కోల్‌కతాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. ఎంఈఏలో ఇండియన్ ఓషియన్ రీజియన్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. త్వరలోనే గీతిక ఇస్లామాబాద్‌లో తన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం.
భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947లో అప్పటి పాకిస్థాన్ డొమినియన్‌కు భారత హైకమిషనర్‌గా శ్రీ ప్రకాశను పంపించారు. అప్పటి నుంచి పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు మిషన్ హెడ్స్‌గా పురుషులు మాత్రమే ఉన్నారు. ఇప్పటికి 22 మంది మిషన్ హెడ్స్‌గా పనిచేశారు. ఇప్పుడు తొలిసారిగా మహిళను ఈ పదవికి ఎంపిక చేశారు. ఇస్లామాబాద్‌లో చివరగా భారత హైకమిషనర్‌గా పనిచేసిన వ్యక్తి అజయ్ బిసారియా. 2019 లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ హైకమిషన్ హోదాను తగ్గించాలని నిర్ణయించడంతో భారత ప్రభుత్వం అజయ్ బిసారియాను ఉపసంహరించుకుంది.