Cyrus Mistry Death: సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపడతాం : దేవేంద్ర ఫడణవీస్
సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పోలీసులను ఆదేశించారు. అహ్మదాబాద్ నుంచి ముంబయికి వస్తుండగా కారు ప్రమాదానికి గురై మిస్త్రీ మరణించారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న మార్గ మధ్యలో... ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పాల్ఘర్ లోని చరోటి ప్రాంతంలో కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సైరస్ మిస్త్రీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పోలీసులను ఆదేశించారు.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించారని తెలియడంతో వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారని తెలిసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. భారత ఆర్థిక, వాణిజ్య రంగాలు ఓ దార్శనికుడిని కోల్పోయాయని ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆనంద్ మహీంద్రా సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
చిన్న వయసులోనే టాటా సన్స్ ఛైర్మన్
సైరస్ మిస్త్రీ 2006లో టాటా గ్రూప్‌లో సభ్యుడిగా చేరారు. 2013లో 43 ఏళ్ల వయసులో టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2016లో టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించారు. టాటాల విశ్వసనీయతకు విరుద్ధంగా నష్టాల్లో ఉన్న విదేశీ కంపెనీల్లో వాటాలను విక్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సైరస్ మిస్త్రీ, టాటా గ్రూపు మధ్య వివాదం కోర్టుకు చేరడం సంచలనంగా మారింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మిస్త్రీ పనిచేశారు. ముంబయి 26/11 దాడుల్లో చనిపోయిన, గాయపడిన వారికి టాటా గ్రూప్ భారీ సహాయాన్ని అందించడంలో సైరస్ కీలక పాత్ర పోషించారు.
టాటా ట్రస్టులో మిస్త్రీకి వాటా
సైరస్ మిస్త్రీ తాత షాపూర్జీ మిస్త్రీ 1930లలో కుటుంబ వ్యాపారం ఆరంభించారు. అదే సమయంలో ఆయన దొరాబ్జీ టాటా నుంచి టాటా గ్రూప్‌లో వాటా కొనుగోలు చేశారు. టాటా గ్రూప్‌లో 18.5 శాతం వాటా సొంతం చేసుకున్నారు. టాటా గ్రూప్‌లో మిస్త్రీ కుటుంబానికి మాత్రమే వాటా ఉంది. ఇది కాకుండా, 66 శాతం వాటాను టాటా గ్రూపులోని వివిధ ట్రస్టులు కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్‌కి సైరస్ మిస్త్రీ ఆరో చైర్మన్.
సైరస్ మిస్త్రీని ఎందుకు తొలగించారు?
టాటా గ్రూప్ ఛైర్మన్‌గా మిస్త్రీని తొలగించడానికి అధికారిక కారణం ఏదీ తెలియదు. సైరస్ మిస్త్రీ ఛైర్మన్ అయ్యాక టాటా గ్రూప్ బోర్డు సభ్యులను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా టాటా గ్రూప్ బోర్డు సభ్యులు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వృద్ధిని సాధించలేకపోయింది. దాంతోనే ఆయన్ను పదవిలోంచి తొలగించారని అంటారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై మిస్త్రీ న్యాయ పోరాటం చేస్తున్నారు.
Maharashtra Home Minister Devendra Fadnavis asks police to conduct detailed investigation into road accident that killed Cyrus Mistry
— Press Trust of India (@PTI_News) September 4, 2022