(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Crime News: ఢిల్లీలో దారుణం - ఫోన్ ఇవ్వలేదని యువకుడిని 45 సార్లు పొడిచి చంపిన మైనర్లు!
Delhi Crime News: తన ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిన ఇద్దరు బాలురును ప్రతిఘటించాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. ఫోన్ ఇవ్వట్లేదని 45 సార్లు కత్తితో పొడిచి సదరు యువకుడిని చంపేశారు.
Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా కార్డ్స్ ఆడుకుంటున్న 18 ఏళ్ల బాలుడి దగ్గరకు వెళ్లిన ఇద్దరు బాలురు... ఫోన్ లాక్కోవడం మొదలు పెట్టారు. దీంతో సదరు యువకుడు ప్రతిఘటించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మైనర్లలో ఒక బాలుడు... తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి పొడవడం ప్రారంభించాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు... దాదాపు 45 సార్లు కడుపు, మెడ, చేతులు, కాళ్లపై దాడి చేసి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్‌లోని సంజయ్ కాలనీలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల హర్ష్ కుమార్ కు చేతికి గాయమైంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అతడికి దెబ్బ తగలడంతో ఆరోజు కళాశాలకు వెళ్లేలేదు. ఉదయం నుంచి ఇంట్లో ఉన్న కుమార్... శనివారం మధ్యాహ్నం నూడుల్స్ కొనేందుకు బయటకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. మైదాన్ గర్షి వద్దనున్న రాధాకృష్ణ దేవాయలం సమీపంలో తనతోటి స్నేహితులతో కలిసి హర్ష్ కుమార్ సరదాగా కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ విషయం గుర్తించి ఇద్దరు బాలురు అక్కడకు వెళ్లారు. హర్ష్ కుమార్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో కుమార్ ప్రతిఘటించాడు.
తీవ్ర కోపోద్రిక్తుడైన ఓ బాలుడు ముందుగా తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి.. కుమార్ పై దాడి చేయడం ప్రారంభించాడు. ముందుగా మెడపై పొడిచిన అతడు ఆపై కాళ్లు, చేతులు, కడుపు ఇలా శరీరమంతటా పొడిచాడు. దాదాపు 45 సార్లు పొడిచి హర్ష్ కుమార్ ను హత్య చేశాడు. ఈ ఘటనతో తీవ్రంగా భయపడిపోయిన హర్ష్ స్నేహితులు పారిపోయారు. హత్య అనంతరం నిందితులు హర్ష్ కుమార్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో.. హర్ష్ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఎంతకూ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంతలోనే మైదాన్ గర్షి వద్ద ఓ మృతదేహం ఉందంటూ పలువురు స్థానికులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హర్ష్ కుమార్ గా గుర్తించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించారు. రక్తపుమడుగులో ఉన్న తమ కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గొంతు, కడుపుపై లోతైన గాయాలు, అనేక కత్తిపోట్లు ఉన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు, అలాగే హర్ష్ కుమార్ తో ఆడుకున్న స్నేహితులను కూడా పోలీసులు గుర్తించారు.
వారిద్దరూ అదుపులోకి తీసుకున్నట్లు డీపీసీ చందన్ చౌదరి వివరించారు. విచారణలో కూడా నిందితులు హత్యా నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుల వద్ద నుంచి హర్ష్ కుమార్ ఫోన్ తో పాటు సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్య చేసినప్పుడు నిందితుల బట్టలు, షూస్ రక్తంతో తడిచిపోయాయని వాటిని కూడా తాము స్వాధీనం చేసుకున్నట్లు పేర్కన్నారు.