Delhi Air Quality: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోని ఢిల్లీ ప్రజలు, ఇష్టం వచ్చినట్లు కాల్చేశారు
Delhi Air Quality: దీపావళి రోజున ఢిల్లీలో బాణసంచా కాల్చడంతో గాలి నాణ్యత దారుణంగా పడి పోయింది. మంగళవారం గాలి నాణ్యత 'తీవ్రమైన' స్థాయికి దిగజారినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గాలి నాణ్యత (Air Quality) మరోసారి క్షీణించింది. దీపావళి రోజున పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో దారుణంగా పడి పోయింది. సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చడంతో మంగళవారం గాలి నాణ్యత 'తీవ్రమైన' స్థాయికి దిగజారినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CCB) తెలిపింది. ఫలితంగా ఢిల్లీని విషపూరిత పొగమంచు దేశ రాజధానిని చుట్టుముట్టింది.
ఉదయం 6 గంటలకు, బవానాలో గాలి నాణ్యత 434, ద్వారకా సెక్టార్ 8లో 404, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి, RK పురం రెండింటిలో 417 వద్ద ఉన్నట్లు సీసీబీ వెల్లడించింది. మంగళవారం ఉదయం సైతం దేశ రాజధానిలో గాలి నాణ్యత 'తీవ్రమైన' కేటగిరీలో ఉన్నట్లు SAFAR-డేటా తెలిపింది. సీపీసీబీ గణాంకాల ప్రకారం, దేశ రాజధానిలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' విభాగంలో 358 వద్ద నమోదైంది. పొరుగున ఉన్న నోయిడా, జాతీయ రాజధాని ప్రాంతంలో ఎన్‌సీఆర్ గురుగ్రామ్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ ఢిల్లీ ప్రజలు బాణ సంచా పేల్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఢిల్లీ పోలీసులు సోమవారం 97 కేసులు నమోదు చేశారు. తూర్పు ఢిల్లీలో 29, నైరుతి ప్రాంతంలో 28 అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని రోహిణి, ఉత్తర ఢిల్లీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) దాని పరిధిలోని ప్రదేశాలలో పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేసింది.
ఈ చర్య తక్షణం అమలులోకి వస్తుందని, జనవరి 31, 2024 వరకు అమలులో ఉంటుందని ఎన్డీఎంసీ పేర్కొంది. ఢిల్లీలో 91 పార్కింగ్ స్థానాలు ఎన్డీఎంసీ పరిధిలో ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 41 నేరుగా నిర్వహిస్తోంది. రాజ్‌పథ్, ఎయిమ్స్, సరోజినీ నగర్ మార్కెట్, ఖాన్ మార్కెట్ వంటి అధిక రద్దీ ఉండే ప్రాంతాలు ఎన్డీఎంసీ పార్కింగ్ నిర్వహణ క్రిందకు వస్తాయి.
దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గడంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సుప్రీంకోర్టు బాణాసంచా నిషేధానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతను బీజేపీ విస్మరించిందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మండిపడ్డారు. ఇది దురదృష్టకరమని, బాణాసంచా కాల్చాలని బీజేపీ కోరుకుంటోందని విమర్శించారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ నేతల కారణంగానే ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోయిందన్నారు.
ఆప్ విమర్శలపై ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా స్పందించారు. ఢిల్లీ ప్రజలను ప్రశంసించారు. ఈ చర్యను ‘ప్రతిఘటన, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం’ అని వ్యాఖ్యానించారు. ప్రజలు అశాస్త్రీయ, నియంతృత్వ నిషేధాన్ని ధైర్యంగా ధిక్కరిస్తున్నారని అన్నారు. బాణసంచా నిషేధాన్ని కఠినంగా అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఉత్తరప్రదేశ్ మాజీ పోలీసు చీఫ్ విక్రమ్ సింగ్ విమర్శించారు. నిషేధం కనీసం మూడు రోజుల ముందుగానే అమలులోకి వచ్చిందన్నారు. ఢిల్లీలో క్రాకర్ల విక్రయాలు, నిల్వలు, ముఖ్యంగా చైనీస్ తయారు చేసిన క్రాకర్లను నిషేధించాలన్నారు.
శుక్రవారం, శనివారం వర్షం కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత 'తీవ్రమైన' నుంచి 'పేలవమైన' వర్గానికి చేరుకుంది. దీపావళికి ఒక రోజు ముందు కాలుష్యం స్థాయి గణనీయంగా తగ్గింది. ఎనిమిదేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేసింది. సగటున AQI 218గా నమోదైంది. అయితే దీపావళి సందర్భంగా బాణసంచా విపరీతంగా పేల్చడంతో ఢిల్లీ గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది.