DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!
దిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దిల్లీలో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మాస్క్ తప్పనిసరి
దిల్లీలో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్ కట్టడికి నిపుణులతో చర్చించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
భారీగా కేసులు
దిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున కొవిడ్ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అధికారులను ఆదేశించారు.
దిల్లీలో ప్రతిరోజూ 500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉంది.
దేశంలో కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగింది. మరో 2,067 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా కొత్తగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,547 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30లక్షల 47వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు చేరుకుంది.
Also Read: Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !