30 వేల అడుగల ఎత్తులో రాఖీ వేడుక
Rakhi in Indigo Plane: 30 వేల అడుగల ఎత్తులో రాఖీ వేడుక జరుపుకున్నారు. అన్నా చెల్లెలు అయిన పైలట్, క్యాబిన్ మెంబర్ విమానంలో పండుగ చేసుకున్నారు.
రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. తోబుట్టువులు ఒకరికొకరు తోడుగా ఉండాలని గుర్తు చేసేది ఈ వేడుక కాబట్టి పండుగను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. కొందరికి ఒక్కోసారి వివిధ కారణాల వల్ల, ఉద్యోగాల వల్ల తమ తోబుట్టువులను కలవడం కుదురకపోవచ్చు. అలాంటప్పుడు వారిని చాలా మిస్ అవుతుంటాం. అయితే ఈ అన్నా చెల్లెలు మాత్రం ఈసారి రాఖీ పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. విమానంలో రాఖీ కట్టుకున్నారు. అయితే అన్న పైలట్ , చెల్లెలు క్యాబిన్ సిబ్బంది అవ్వడం మరింత ప్రత్యేకం.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ సిబ్బంది అయిన శుభ అదే విమానంలో పైలట్‌గా ఉన్న తన అన్నయ్య గౌరవ్‌కు విమానంలో అందరి ముందు రాఖీ కట్టారు. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ వీడియోను ఇండిగో ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్( ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. విమానం టేకాఫ్ అవుతుండగా శుభ ప్రయాణికుల ముందు నిలబడి ఇది ప్రత్యేక అనౌన్స్‌మెంట్ అని చెప్తుండగా వీడియో ప్రారంభమైంది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ' మా లాంటి వృత్తిలో పని చేసే వారికి ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక సందర్భాలను ఇంట్లో ప్రియమైన వారితో కలిసి జరుపుకోలేం. ఎందుకంటే మీరు మీ ప్రియమైన వారితో గడిపేందుకు తిరిగి మిమ్మల్ని మీ ఇళ్లకు చేర్చడమే మాకు ముఖ్యం కాబట్టి' అని అన్నారు.
అయితే ఈరోజు మాత్రం తనకు, తన సోదరుడు గౌరవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు అని శుభ అభివర్ణించారు. తాము చాలా ఏళ్ల తర్వాత రక్షాబంధన్ జరుపుకుంటున్నామని చెప్పారు. అందరు సోదర సోదరీమణుల్లాగే తాము కూడా ఆడుకోవడం, కొట్టుకోవడం, నవ్వుకోవడం అన్నీ చేసే వాళ్లమని.. తన అన్నయ్య తన బెస్ట్ ఫ్రెండ్ అని, తను రాక్ అని, తన సపోర్ట్ అని ఆమె వెల్లడించారు. ఇలా మాట్లాడిన తర్వాత ఆమె గౌరవ్ చేతికి రాఖీ కడుతుంటే ప్రయాణికులంతా చప్పట్లతో సంతోషం వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఇండిగో ట్వీట్ చేసింది. 30,000 అడుగుల ఎత్తులో అయినా, నేల మీద అయినా సోదర సోదరీమణుల బంధం ఎప్పుడూ ప్రత్యేకమే అని ట్వీట్‌లో పేర్కొంది. తమ చెక్ క్యాబిన్ అటెండెంట్ శుభ, తన సోదరుడు కెప్టెన్ గౌరవ్‌తో విమానంలో రాఖీ వేడుక జరుపుకోవడం హృదయాన్ని హత్తుకునే ఘటన అని తెలిపింది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. విమాన సిబ్బంది, పైలట్స్‌ను చూసి మంచి ప్రొఫైల్ ఉండే జాబ్స్ అని అనుకుంటాం.. కానీ వాటి వెనుక వారు చాలా కష్టపడతారని, ఎండ, వాన, పండుగలు, వివిధ పనివేళలతో సంబంధం లేకుండా వారు ఉద్యోగాలు చేస్తుంటారని, ఇదంతా ఎవ్వరూ గుర్తించరని చెప్పుకొచ్చారు. మరికొంత మంది అన్నా చెల్లలు అనుబంధం గురించి పోస్ట్‌లు చేశారు. మరో యూజర్.. ఎక్కడ ఉన్నా అన్నా, చెల్లి అనుబంధం గురించి చెప్పలేమని, ఇండియన్ అయినందుకు గర్వపడుతున్నానని పోస్ట్ చేశారు.