COVID 19 Cases In India: భారత్‌లో 5 వేలు దాటిన కరోనా కేసులు, 4 కొత్త వేరియంట్లు నిర్ధారణ- ఈ ఏడాది ఎంత మంది చనిపోయారంటే
భారత్ లో కోవిడ్ కేసులు 5364 కు పెరిగాయి. 55 మరణాలు, 4 కొత్త వేరియంట్లు గుర్తించారు. కేరళలో ఎక్కువ కేసులు.

Corona Cases in India | భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య 5,000 దాటింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 5,364కి చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 498 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో దేశంలో నలుగురు మరణించగా, జనవరి 1 నుండి మొత్తం మరణాల సంఖ్య 55కి చేరుకుంది. గత 20 రోజుల్లో కేసుల సంఖ్య 58 రెట్లు పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. మే 16న మొత్తం క్రియాశీల కేసులు 93 మాత్రమే ఉండగా, ఇప్పుడు అవి 5,364కి పెరిగాయి. గత 24 గంటల్లో కేరళలో 192 మంది కరోనా బారిన పడగా, గుజరాత్‌లో 107 కేసులు నమోదయ్యాయి.
అధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు
దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో అత్యధికంగా 1,679 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ (592), మహారాష్ట్ర (548) ఉన్నాయి.
జనవరి నుంచి కరోనా వైరస్ కొత్త వేరియంట్ కారణంగా 55 మంది చనిపోయారు. వీటిలో 53 కోవిడ్ మరణాలు కేవలం గత 15 రోజుల్లోనే జరిగాయి. ఢిల్లీలో గురువారం నాడు మరో రెండు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, ఇందులో ఐదు నెలల చిన్నారి ఉంది. కేరళలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 17 మరణాలు సంభవించాయి.
వేసవి సెలవుల అనంతరం ఒడిశాలోని స్కూల్స్ కోవిడ్19మార్గదర్శకాలతో తిరిగి ప్రారంభమయ్యాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న పిల్లలు మాస్క్‌లు ధరించాలని విద్యా మంత్రి నిత్యానంద్ గోండ్ సూచించారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఉండి ఐసోలేషన్ అవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం జూన్ 5న వివిధ రాష్ట్రాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఈ డ్రిల్స్ ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మెడిసిన్ లభ్యత, వెంటిలేటర్ సౌకర్యాలను సైతం అధికారులు పరీక్షించారు. కోవిడ్ 4వ వేవ్ కోసం ఆసుపత్రుల సన్నద్ధతను అంచనా వేయడానికి డ్రిల్స్ చేస్తున్నారు. జూన్ 2న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్లతో సహా ప్రారంభ డ్రిల్ నిర్వహించారు.
దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్‌లు గుర్తింపు
దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతుండగా పలు రాష్ట్రాల్లో 4 కొత్త కోవిడ్19 వేరియంట్‌లను గుర్తించారు. దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాల సీక్వెన్సింగ్ చేసిన తరువాత LF.7, XFG, JN.1, NB.1.8.1 లకు చెందిన 4 వేరియంట్‌లను గుర్తించినట్లు ICMR డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు.
ఈ వేరియంట్‌లను పర్యవేక్షించడానికి ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాలను కూడా సీక్వెన్స్ చేస్తారు. ప్రస్తుం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ, ఐసీఎంఆర్ ప్రతినిధులు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్‌లను ఆందోళనకరంగా ఉన్న జాబితాలో చేర్చలేదు. కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇటీవలి మరణాల వివరాలు:
- కర్ణాటక : అధిక రక్తపోటు, నియంత్రణలో లేని మధుమేహంతో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి చనిపోయారు.
- కేరళ (2 మరణాలు): తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, అధిక రక్తపోటు, కాల్సిఫిక్ అయోర్టిక్ వాల్వ్, COPD, మధుమేహంతో బాధపడుతున్న 74 ఏళ్ల మహిళ మృతిచెందింది. అధిక రక్తపోటు, సెరెబ్రోవాస్కులర్ ప్రమాదం, లివర్ ప్రాబ్లమ్, సూడోమోనాస్ వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ తో79 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు.
- పంజాబ్: ఊపిరితిత్తుల త్రాంబోఎంబాలిజం, ఊబకాయం సమస్యతో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ చనిపోయారు.






















