కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తున్న కీలక నేతలు, బీజేపీలోకి క్యూ
కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్నవారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
Congress Leaders Quits : కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం ఉన్నవారు, పార్టీ సీనియర్ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కొందరు రాహుల్ గాంధీ నాయకత్వంపై తప్పు పడుతూ రాజీనామా చేస్తున్నారు. మరికొందరేమో కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా బయటకు వెళ్లిపోతున్నారు. హస్తం పార్టీని వీడిన నేతల చిట్టా తిరగేస్తే...భారీగా ఉంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీని వీడి...ఆ పార్టీ గెలుపు ఆశలపై దెబ్బ కొట్టారు.
అటు జోడో యాత్ర...ఇటు షాకులు
రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తుంటే... ఆయన స్నేహితుడు, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా పార్టీకి గుడ్ బై చెప్పారు. 2012-2014 మధ్య నౌకాయాన శాఖా మంత్రిగా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పని చేశారు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు...రాహుల్ గాంధీతో సన్నిహితంగా మెలిగిన ఆర్పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద హస్తం పార్టీకి రాం రాం చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్‌లో మంచి పట్టున్న ఆర్‌పీఎన్ సింగ్...2022 జనవరిలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడారు. మరో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కూడా అదే దారిలో నడించారు. రాహుల్ గాంధీ టీమ్‌లో పని చేసిన ఆయన యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి...కాషాయ పార్టీలో చేరిపోయారు.
సింధియా నుంచి సునీల్ జాఖడ్ దాకా
రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేతల్లో జ్యోతిరాదిత్య సింధియా ముందు వరుసలో ఉండేవారు. 2020లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కమల్‌నాథ్‌కు అప్పగించడంతో... ఆగ్రహంతో రగిలిపోయారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి...బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో విమానయాన శాఖా మంత్రిగా పని చేస్తున్నారు జ్యోతిరాదిత్య సింధియా. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన సునీల్ జాఖఢ్ 2022లో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి... బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశ్వనీ కుమార్...2022 ఫిబ్రవరిలో హస్తం పార్టీకి బై బై చెప్పేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేసిన కెప్టెన్ అమరీందర్...పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు...కాంగ్రెస్‌కు షాకిచ్చారు.
గుజరాత్ ఎన్నికల ముందు హర్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ ఝలక్
గుజరాత్‌కు అసెంబ్లీ ఎన్నికల ముందు హర్దిక్ పటేల్, ఆల్పేష్ ఠాకూరు హస్తం పార్టీకి ఝలక్ ఇచ్చారు. గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్‌ను 2019లో...రాహల్ గాంధీ పార్టీలోకి తీసుకొచ్చారు. 2022లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేశారు. ఊహించని విధంగా బీజేపీలో చేరి...ఆ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన హిమంత బిశ్వ శర్మ...ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న కారణంతో పార్టీని వీడారు. ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ అంటోని కూడా బీజేపీలో చేరారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ బయటకు వెళ్లిపోయారు. క్రిష్ణ తీర్థ్, ఛౌదరీ బీరేందర్ సింగ్, మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ రంజిత్ దేశ్‌ముఖ్ గుడ్ బై చెప్పారు.