Karnataka: కర్ణాటక స్టూడెంట్స్‌కు సూపర్ న్యూస్, ఏకంగా మూడు సార్లు పబ్లిక్ పరీక్షలు
Karnataka: కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (KSEAB) పదో తరగతి, 12 తరగతి పరీక్షా విధానంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
Karnataka: కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (KSEAB) పదో తరగతి, 12 తరగతి పరీక్షా విధానంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు సార్లు వార్షిక పరీక్షను ప్రవేశపెట్టనుంది. మంగళవారం బెంగళూరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప ఈ విషయాన్ని ప్రకటించారు.
గతంలో ఉన్న సప్లిమెంటరీ పరీక్షల స్థానంలో వార్షిక పరీక్ష 1, 2, 3 ప్రవేశపెట్టనుంది అక్కడి ప్రభుత్వం. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడం, వారిలో సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించేలా మూడు అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఇటీవల రెండు సార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఏడాదికి మూడు వార్షిక పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. 2024 మార్చి/ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు లోకి రానుంది.
ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఒకే వార్షిక పరీక్షలకు అవకాశం ఉంటుంది. వీరు పదో తరగతిలో ఒక సప్లిమెంటరీకి, 12వ తరగతికి రెండు సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. ఆపై సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు. విద్యార్థులు మొదటి పరీక్షలో సాధించిన మార్కులతో సంతృప్తి చెందకపోతే రెండు, మూడు వార్షిక పరీక్షలు రాసి వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష 1కి తప్పనిసరిగా హాజరుకావాలి. రిపీటర్, ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష 2, పరీక్ష 3కి హాజరుకావచ్చు. విద్యార్థులు ఒకే సబ్జెక్టులను వేర్వేరు వార్షిక పరీక్షల్లో రాసినా వాటిలో సాధించిన ఉత్తమ ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే మార్కుల జాబితాలో పరీక్షల ప్రస్తావన ఉండదు.
KSEAB చైర్మన్ రామచంద్రన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థి వార్షిక పరీక్షలో ఏదైనా సబ్జెక్టులో సాధించిన మార్కులతో సంతృప్తి చెందకపోతే, సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్నారు. అందులో తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా వాటినే పరిగణిస్తారు. ఇది విద్యార్థులు నష్టపోయేలా ఉంది. దానిని సవరించిన సరికొత్త పరీక్షా విధానాంలో విద్యార్థులు మూడు సార్లు పరీక్షలు రాస్తారు. వాటిలో సాధించిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఫలితంగా విద్యార్థులు మెరుగైన మార్కులతో సాధించడంతో పాటు తదుపరి చదువులు, ఉపాధి కోసం ఎంపిక ప్రక్రియలో మెరుగైన అవకాశాలను అందిస్తుందన్నారు.
ఒకే వార్షిక పరీక్ష, ఒకే సప్లిమెంటరీ పరీక్ష విధానంతో విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనను పెంచుతోందని రామచంద్రన్ అన్నారు. దీంతో విద్యార్థి జ్ఞాన ధారణ, అర్థవంతమైన చదువు, విద్యా ప్రగతికి ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రతి విద్యార్థి నేర్చుకునే వేగం, శైలి భిన్నంగా ఉంటాయని, వార్షిక పరీక్షలు 1, 2, 3 నిర్వహించడం ద్వారా వారి అభ్యాస వేగానికి అనుగుణంగా, తగినంత సమయం ఉండడం ద్వారా విద్యార్థుల్లో కలిగే ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
సవరించిన పరీక్షా విధానం గురించి విద్యార్థులకు స్పష్టమైన మార్గదర్శకాలను బోర్డు సర్క్యులర్ ద్వారా జారీ చేస్తుందని రామచంద్రన్ చెప్పారు. ఈ మూడు పరీక్షలలోని ప్రశ్నపత్రాలలో విషయ సామర్థ్యం అలాగే ఉంటుందన్నారు. ఈ మూడు ప్రయత్నాలలో విద్యార్థులు సాధించిన మార్కులలో ఉత్తమ స్కోర్‌ను ఎంచుకోవడానికి సబ్జెక్టుల వారీగా అవకాశం ఉంటుందన్నారు. తదుపరి అకడమిక్ కోర్సులో ఆలస్యంగా చేరిన విద్యార్థులకు, ప్రారంభ నెలలో మిస్సైన తరగతులను వివరించేలా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు లేదా ‘బ్రిడ్జ్ కోర్సు’ అందిస్తామన్నారు.