Pilot License Tenure: పైలట్ల లైసెన్స్ కాలపరిమితి 10 ఏళ్లకు పెంపు - కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
Pilot License Tenure: పైలట్ల లైసెన్స్ కాలపరిమితిని పదేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ కు సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
పైలట్ల లైసెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ 5 ఏళ్లుగా ఉన్న కాల పరిమితిని పదేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ - 1937కు సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్ కు అనుగుణంగా ఈ నిబంధనలు ఉన్నట్లు వెల్లడించింది.
ఈ సవరణల ప్రకారం ఎయిర్ లైన్ ట్రాన్స్ పోర్ట్ పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ల కాల పరిమితి పదేళ్లకు పెరుగుతుంది. దీంతో డీజీసీఏ, పైలట్లపై పరిపాలనా భారం తగ్గి మరింత పారదర్శకమైన లైసెన్సింగ్ ప్రక్రియ అమల్లోకి వస్తుందని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
'ఫాల్స్ లైట్స్'లోనూ మార్పులు
దీంతో పాటే ఏరో డ్రోమ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించే 'ఫాల్స్ లైట్స్'లో మార్పులు చేశారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే లైట్లను ఏరోడ్రోమ్ కు 5 కి.మీ వరకూ ప్రదర్శించకూడదన్న నిబంధన ఇది వరకూ ఉండగా, ఇప్పుడు ఆ పరిధిని 5 నాటికల్ మైళ్ల వరకూ పొడిగించారు.
విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిషేధిత లైట్లు ప్రదర్శిస్తే వాటిని 24 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. లేదంటే ఆ ప్రాంతం నుంచి వాటిని తొలగించే అధికారం ఈ నిబంధనతో ప్రభుత్వానికి వస్తుంది. అదే సమయంలో, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ప్రమాదకర లైట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించే పరిస్థితి లేకున్నా అధికారులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చు.