Census of India: జనవరి నుంచి జనాభా లెక్కలు ప్రారంభం- 2028లో నియోజకవర్గాల పునర్విభజన!
Census In India: దాదాపు నాలుగేళ్ల ఆలస్యంగా దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్తీకరణ ఉన్నందున ఈ గణన కీలకంకానుంది.
Census In India: దేశంలో జనాభా గణనకు కేంద్రం సిద్ధపడుతోంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ 2025లో ప్రారంభంకానుంది. జనవరి నుంచి జనాభా గణన ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ మరింత ఊపందుకుంది. ఈ ప్రక్రియను కూడా 2028లో ముగిస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది.
కరోనా కారణంగా వాయిదా
భారతదేశంలో జనాభా లెక్కలు ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. గత జనాభా లెక్కలను 2011లో నిర్వహించారు. వాస్తవంగా 2020లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టి 2021లో ముగించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు కేంద్రం ఇప్పుడు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. 2025 జనవరి నుంచి జనాభా లెక్కలు చేపట్టాలని చూస్తోంది.
2026 నాటికి జనాభా లెక్కలు పూర్తి చేసి 2028 నాటికి లోక్‌సభ,వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా కంప్లీట్ చేయాలని కేంద్రం భవిస్తున్నట్టు సమాచారం. సెన్సస్‌ను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెన్సస్ కమిషనర్ పూర్తి చేస్తారు.
31 ప్రశ్నలతో రెడీ
ఇప్పటి వరకు జనాభా లెక్కల్లో స్త్రీ పురుషులు, ఇతరులు, పిల్లలు, చదువుకున్న వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మతం, కులం వివరాలు మాత్రమే సేకరించే వారు. ఇప్పుడు కొత్తగా కుల జనాభా లెక్కలు తెరపైకి వస్తున్నందున వాటి వివరాలు మరింత డీప్‌గా తెలుసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం లేదు. ఎప్పటి మాదిరిగానే గతంలో జనాభా వివరాలు సేకరించినట్టుగానే 31 ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి 30 సెప్టెంబర్ 2020 వరకు జనాభా వివరాలు సేకరించాలనే ప్రతిపాదన ఉండేది. ఇంతలో కరోనా రావడంతో ఆ ప్రక్రియ ఇన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత జనాభా గణనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 2025 జనవరిలో ప్రక్రియ ప్రారంభించి 2026 జనవరికల్లా ముగించనున్నారు. ఈ వివరాల సేకరణ పూర్తిగా డిజిటల్‌లోనే జరుగుతుందని అంటున్నారు.
15 సార్లు జనభా గణన
భారత దేశంలో తొలిసారిగా 1872లో జనాభా వివరాల సేకరణ మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఈ జనాభా గణన చేపట్టారు. మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రక్రియ సాగేది. 1949 తరువాత భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ గణన బాధ్యత తీసుకుంది. ఇప్పటి వరకు ఒక విధానంలో జనాభా లెక్కలు సేకరించేవాళ్లు. 2021న ప్రకటించాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా ఆలస్యం కావడంతో సైకిల్ మారిపోనుంది. ఇకపై ప్రతి పదేళ్లకు ఒకసారి అనుకుంటే వచ్చే 2035-36లో జనాభా లెక్కలు జరగనున్నాయి.
2028లోనే నియోజకవర్గాల పునర్విభజన
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దగ్గర్లో ఉండటంతో ఈ జనాభా లెక్కలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనాభా నియంత్రణ విధానాలు పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. ఇది తమకు ఇబ్బందిగా మారుతుందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో నష్టపరుస్తాయని ఇప్పటికే స్టాలిన్ లాంటి వాళ్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
1971 జనాభా లెక్కల ప్రకారం గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు జరగాల్సి ఉంది. అయితే 2026 తర్వాత జరగాల్సిన ప్రక్రియను ఈ జనాభా లెక్కలు కాకుండా వచ్చే పదేళ్ల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఆర్టికల్ 82ని గుర్తు చేస్తున్నారు. ఒక వేళ చేపట్టాలంటే మాత్రం కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
Also Read: రతన్ టాటా వీలునామాలో శంతనునాయడు పేరు - ఎన్ని ఆస్తులు రాసిచ్చారంటే ?