మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్- బహిరంగ సభలు, చేరికలపై ప్రత్యేక కసరత్తు
మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కేసీఆర్... చేరికలను ప్రోత్సహిస్తూనే.. బీఆర్‌ఎస్ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో బహిరంగ సభల ఏర్పాటును ముమ్మరం చేస్తున్నారు. నాయకుల చేరిక కూడా అదే స్పీడ్‌తో సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మహారాష్ట్రలో ప్రత్యమ్నాయ శక్తిగా బీఆర్‌ఎస్‌ను చూపాలన్నదే కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కేసీఆర్... చేరికలను ప్రోత్సహిస్తూనే.. బీఆర్‌ఎస్ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓ ప్రాంతంలో భారీ బహిరంగ సభ పెట్టడం ఆ తర్వాత ఆ ఏరియాలో కీలకమైన యాక్టివ్‌గా ఉన్న నేతలను పార్టీలో చేర్పించుకుంటున్నారు. రెండు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లడంతోపాటు పార్టీ కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన భావిస్తున్నారు.
నాందేడ్, కందార్-లోహాలో సభల విజయంతో జోష్ మీద ఉన్న కేసీఆర్ ఇప్పుడు మూడో సభకు ప్లాన్ చేశారు. రెండు సభలతో మరాఠ్వాడా ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న బీఆర్‌ఎస్ ఇప్పుడు మధ్య మహారాష్ట్రపై దృష్టి పెట్టింది. ఈ నెల 24న ఔరంగాబాద్‌లో నిర్వహించనున్న సభకు బీఆర్‌ఎస్ శ్రేణు లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
కంధార్-లోహా సభ అనంతరం ఔరంగాబాద్‌లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజల నుంచి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మోడల్‌పై అవగాహన కల్పించాలని డిసైడ్ అయింది పార్టీ. అందులో భాగంగా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలపై వీడియో స్క్రీన్స్‌పై ప్రదర్శిస్తున్నారు. వీటిని ఊరూరా తిప్పి ప్రజల దృష్టిని ఆకట్టుకోనున్నారు.
ఇదే వ్యూహాన్ని కంధార్-లోహా బహిరంగ సభకు ముందు అనుసరించారు. ఇప్పుడు ఔరంగాబాద్ సభకు ముందు కూడా ఇలాంటి ప్రచారాన్నే నమ్ముకుంది బీఆర్‌ఎస్. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు విస్తృత ఆదరణ లభిస్తున్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగుచెందారని అందుకే కేసీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ విజన్‌తోపాటు బీఆర్‌ఎస్ విధానాలకు కూడా అక్కడ యువత ఆకర్షితులవుతున్నారని అంటున్నారు.
అలాంటి చాలా మంది నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వివరిస్తున్నారు. సోమవారం శివసేన సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్నా సాహెబ్ మానె బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు గంగాపూర్‌కు చెందిన సంతోష్‌కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ ప్రణాళికలు వేస్తోంది. ఔరంగాబాద్ లో నిర్వహించతలపెట్టిన మూడో బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీజేపీ, శివసేనతో పాటు ఎన్సీపీ, శివ సంగ్రామ్ పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్ నేత శరద్ ప్రవీణ్ జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్ తో పాటు వివిధ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.