Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!
కర్నాటకలో ఆదివారం జరిగిన ఓ పెళ్లి వైరల్‌గా మారింది. తాళి కట్టే టైంలో వధువు ఇచ్చిన షాక్‌లకు బంధువులతోపాటు సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంగుతిన్నారు.
పెళ్లి మండపం సందడిగా ఉంది. మేళతాళాలతో బంధు మిత్రుల రాకతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతోంది. తాళి కట్టే శుభ వేళ రానే వచ్చింది. భజంత్రీలు భజంత్రీలు అంటూ పంతులు గట్టిగా అరిచాడు. వరుడి చేతికి తాళి ఇచ్చాడు పంతులు. తాళి పట్టుకొని లేచిన వరుడు.. పక్కనే ఉన్న వధువు మెడలో కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో వధువు స్పృహ తప్పి పడిపోయింది. అంతే అంతా షాక్. వరుడికి రెండు చేతులు వణుకు మొదలైంది. ఇదేంటి ఇలాం జరిగిందని బంధువులంతా ఒకటే ఆందోళన.
సీన్ కట్ చేస్తే ముహూర్తం మించిపోయింది. ఇంతలో వధువు కూడా కాస్త తేరుకుంది. తర్వాత ముహూర్తం ఉందని పంతులు చెబుతుండగా వధువు బాంబు పేల్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. అందుకే మూర్చపోయినట్టు నటించానని కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఆమె చెబుతున్న మాటలు విన్న అక్కడి వారంతా అవాక్కయ్యారు.
కర్ణాటకలో జరిగిన ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మైసూర్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైన యువకుడి బంధువులు ఓ పెద్ద మ్యారేజ్ హాల్ బుక్ చేశారు. అందర్నీ పిలిచి ఆదివారం సందడిగా వివాహానికి ఏర్పాట్లు చేశారు. పిలిచిన బంధువులంతా వచ్చారు. తాళి కట్టే టైంలో వధువు ఇచ్చిన షాక్‌కు అక్కడి వారి మతి పోయింది. ఏం చేయాలో అర్థం కాక వధువును తిట్టిపోయడం స్టార్ట్ చేశారు.
వరుడి బంధువుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వధువు... పక్కింటి యువకుడిని ప్రేమిస్తున్నానని మరో బాంబు పేల్చింది. ఇలా షాక్‌లు మీద షాక్‌లు ఇచ్చి అక్కడి వారి ఫ్యూజ్‌లు ఎగరగొట్టేసిందామె. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని వేరే వ్యక్తిని చేసుకోనని తెగేసి చెప్పేసింది.
పెళ్లికి ముందే వరుడికి ఓ అజ్ఞాత వ్యక్తి మెసేజ్ చేశాడు. వధువు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని.. ఆమెను పెళ్లి చేసుకుంటే సమస్యల్లో పడావని వరుడిని హెచ్చరిస్తూ మెసేజ్ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అతను... కాబోయే భార్యకు వచ్చి చూపించాడు. దీని సంగంతి ఏంటని ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని.. ఎవరో గిట్టని వాళ్లు ఇలా చేసి ఉంటారని కవర్ చేసిందామె.
పెద్దలు, మధ్యవర్తులు కలుగుజేసుకొని వధువును నచ్చజెప్పారు. దీంతో కాస్త మెత్తబడిన ఆమె... పెద్దలు కుదిర్చిన వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడి తరఫు బంధువులు పెళ్లి వద్దే వద్దంటూ పట్టుబట్టారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తమ బిడ్డ భవిష్యత్ ఇబ్బంది పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వధువు తరఫు బంధువులు ఎంత రిక్వస్ట్ చేసినా వాళ్లు అంగీకరించలేదు.
పెళ్లి విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరుడి బంధువులు ఆగ్రహంతో వధువును, ఆమె బంధువులను పెళ్లి మండపం నుంచి గెంటేశారు. దీంతో అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. వధువును అక్కడే ఉంటే ప్రమాదమని గ్రహించి పోలీసు స్టేషన్‌కు తరలించారు పోలీసులు.