BPL Ration Card: ఉచిత బియ్యం బదులు డబ్బు పంపిణీ, ధాన్యం కొరత కారణంగా కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
BPL Ration Card: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా పంపిణీ చేసే బియ్యానికి బదులు డబ్బులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
BPL Ration Card: కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్యభాగ్య పథకంలో భాగంగా బియ్యానికి బదులుగా డబ్బులు పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సదర్భంగా ఇచ్చిన ఐదు కీలకమైన హామీల్లో అన్నభాగ్య పథకం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం.. ప్రతి బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు) ఖాతాదారులకు 5 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది.
అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అదనంగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. కానీ బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. మరో వైపు జులై 1వ తేదీ నుంచి అన్నభాగ్య పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సిద్ధరామయ్య సర్కారు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఉచితంగా అందిస్తామన్న అదనపు 5 కిలోల బియ్యానికి బదులు అందుకు సమానమైన మొత్తం డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు కర్ణాటక రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ భేటీ నిర్ణయాలను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ. 34 ఉందని తెలిపారు. నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అన్నభాగ్య పథకానికి అవసరమైన బియ్యం సేకరించలేకపోయిందని వెల్లడించారు. రాష్ట్రానికి బియ్యం సరఫరా చేసేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదని అన్నారు. ఇక అన్నభాగ్య పథకాన్ని జులై 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సి ఉన్నందున.. బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేమని, అందుకే బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. బియ్యం అందుబాటులోకి వచ్చేంత వరకు.. కిలో బియ్యానికి రూ. 34 చొప్పున డబ్బు ఇస్తామన్నారు. జులై 1 నుంచి ఈ నగదు నేరుగా బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయని, అదే ఇద్దరు వ్యక్తులు ఉంటే రూ. 340 వస్తాయని చెప్పారు. అలాగే ఒక రేషన్ కార్డులో ఐదుగురు వ్యక్తులు ఉంటే నెలకు రూ. 850 ను ఖాతాల్లో జమ చేస్తామని కేహెచ్ మునియప్ప తెలిపారు.
అన్నభాగ్య పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని అప్పుడు నేతలు చెప్పారు. అయితే ఈ మేరకు బియ్యాన్ని సేకరించడంలో సమస్యలు తలెత్తాయి. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన బియ్యాన్ని కేంద్రం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన బీజేపీ నాయకులు.. బియ్యం అందిస్తామని తామెప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం అయింది అంటూ బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పథకం అములను వాయిదా వేయకుండా అలాగే జనాలకు ఇచ్చిన హామీని నెరవేర్చేలా బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial