BJP About Rama: బీజేపీ రాముడి గురించే మాట్లాడుతుంది, సీత గురించి ఎందుకు మాట్లాడదన్న మమతా బెనర్జీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఫైరయ్యారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట సందర్భంగా బెంగాల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.
Mamatha Banarjee Comments : కేంద్రంలోని బీజేపీ (Bjp) ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarjee) ఫైరయ్యారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట సందర్భంగా బెంగాల్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని, సీత గురించి ఎందుకు ఎక్కడా ప్రస్తావించదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీని స్త్రీ వ్యతిరేకి అని విమర్శించారు. రాముడు వనవాసం సమయంలో సీతాదేవి ఆయన వెంటే ఉందని, బీజేపీ నాయకులు మాత్రం సీతాదేవి గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు మమతా బెనర్జీ. వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మతం పేరుతో ఉపన్యాసాలొద్దు
తాను దుర్గా మాతను పూజిస్తానన్నారు మమతా బెనర్జీ. భక్తి, మతం గురించి బీజేపీ నేతలు ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదని మండిపడ్డారు. ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో లబ్దిపోందడానికి మతంతో రాజకీయాలు చేయనన్న మమతా బెనర్జీ....మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనన్నారు. మతం పేరుతో ఎవరు రాజకీయాలు చేసినా వ్యతిరేకిస్తానన్నారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై ఎవరికి అభ్యంతరం లేదన్నారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య మోడీ పూజలు
వందల ఏళ్లుగా ఎదురుచూసిన అపురూప క్షణాలు అయోధ్యలో ఆవిష్కృతమయ్యాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. సంప్రదాయ దుస్తులతో వచ్చిన ప్రధాని మోడీ...శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకున్నారు. రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోడీ వ్యవహరించారు. ప్రధాని మోడీ పక్కనే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీనులై పూజల్లో పాల్గొన్నారు వేదమంత్రాలు, మంగళవాద్యాలతో గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం వద్ద... ప్రధాని మోడీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య పూజాదికాలు నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ఆలయం ప్రాంగణం బయట ఆశీనులైన దేశ, విదేశీ అతిథులు... ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని LED తెరలపై వీక్షించారు.
బాలరాముడి దర్శన భాగ్యంతో తరించిన భక్తులు
మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాముడికి ప్రధాని మోడీ పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత శ్రీరాముడికి హారతి ఇచ్చారు. విల్లు, బాణం ధరించి, బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముడిని చూసి భక్తకోటి పులకరించింది. చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలిగింది. రామ మందిరాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరణతో మెరిసిపోతోంది. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసే వరకు మంగళ వాయిద్యాలు మోగించారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు.