BJP MLA Saurabh Singh : బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ సింగ్‌పై హత్యాయత్నం! ఇంటి వద్ద వాకింగ్ చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు
Uttar Pradesh Crime News: లఖింపూర్ ఖేరీలోని బీజేపీ ఎమ్మెల్యేపై ఇద్దరు మద్యం సేవించే వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని కాస్తా బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్ సింగ్‌పై శివ్ కాలనీలో హత్యాయత్నం జరిగింది. తన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు అందులో పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు తన నివాసం సమీపంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. దానిపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాటా మాట పెరిగి కాల్పులు జరిపారు.
శాంతి భద్రతలపై సౌరభ్ సింగ్‌ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎమ్మెల్యే ఏం చెప్పారంటే... బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యతో కలిసి రొటీన్ వాకింగ్‌కు వెళ్లానని, తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఇద్దరు యువకులు మద్యం సేవించడం చూశానని చెప్పారు. ఇలా బహిరంగంగా మద్యం సేవించడంపై వారిని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. దీంతో వారితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు తుపాకీని తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపి మోటార్ సైకిల్‌పై పారిపోయారు.
సౌరభ్ సింగ్ ఈ ఘటనను తనపై హత్యాయత్నంగా అభివర్ణించారు. రోజూ సాయంత్రం ఇలా వాకింగ్ చేస్తుంటానని ఈ విషయం స్థానికులకు బాగా తెలుసు అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఘటన సమయంలో తన సెక్యూరిటీ గార్డు చాలా దూరంలో ఉన్నారని వివరించారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిందని ఎమ్మెల్యే తెలిపారు.
పోలీసులు విచారణ ప్రారంభం
ఈ సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి సంబంధించిన ఫుటేజీలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఇద్దరు యువకుల ఆచూకీ తెలియరాలేదు.
లఖింపూర్ ఖేరీలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు యంత్రాంగం చెబుతోంది. ఈ ఘటనపై స్థానికులు, బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.