Bhagavad Gita: విమాన ప్రమాదంలో మరో అద్భుతం, మంటల్లోనూ చెక్కుచెదరని భగవద్గీత- వీడియో వైరల్
Bhagavad Gita At AIr India Plane crash spot | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడటం ఓ అద్భుతం కాగా, ఆ ప్రమాద స్థలంలో భగవద్గీత దొరికింది.

Bhagavad Gita Remained Safe in Air India Plane Crash : గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జూన్ 12 నాడు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న మొత్తం 242 మంది ఉండగా ఒకరు మినహా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి ప్రమాదం నుండి బయటపడటంతో అతడి పేరు మార్మోగుతోంది. అతని పేరు రమేష్ కుమార్ విశ్వాస్. ప్రమాదానికి గురైన డ్రీమ్ లైనర్ 787 ప్లేన్ లో ఎకానమీ క్లాస్ లోని 11A సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన బ్రిటిష్ పౌరుడు రమేష్ కుమార్ చాలా అదృష్టవంతుడు. విమానం మంటల్లో కాలిపోగా, ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని రమేష్ విషయం తెలియక అహ్మదాబాద్ పోలీసులు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎవరైనా బయటపడటం అద్భుతంగానే చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో మరో ఆశ్చర్యకర ఘటన జరిగింది.
విమాన ప్రమాదంలో జరిగిన మరో అద్భుతం?
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా ప్రమాదం ఘటనలో మరొక అద్భుతం జరిగింది. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత మంటల్లో కాలిపోలేదు. చెక్క చెదరకుండా అలాగే ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. లేటెస్ట్ నివేదికల ప్రకారం, ప్రమాదం తర్వాత సహాయక బృందం శిథిలాలను తొలగిస్తుండగా వారి దృష్టి ఒక పుస్తకంపై పడింది. మంటలు, పొగ మధ్య కూడా ఆ పుస్తకం కాలిపోకుండా ఉందని తెలిపారు.
మంటలు తట్టుకున్న భగవద్గీత
విమాన ప్రమాదం తర్వాత దొరికిన భగవద్గీత పుస్తకానికి ఏం కాలేదు. పెద్ద పెద్ద వస్తువులు కాలిపోయాయి. బిల్డింగ్ కూలిపోయింది. అందులోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆశ్చర్యకరంగా భగవద్గీత మాత్రం మంటలు తట్టుకుని అలా కనిపించడం చూసి అంతా షాకవుతున్నారు. అన్ని పేజీలు ఉన్నాయి. ఇప్పటికీ సులభంగా చదవవచ్చు అంటే భగవద్గీతకు ఏం కాలేదు. ఇది కేవలం యాదృచ్చికం కాదని ప్రజలు నమ్ముతున్నారు.
అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తర్వాత లోపల నుండి శ్రీమద్ భగవద్గీత పుస్తకం దొరికింది, దానికి ఏమాత్రం నష్టం జరగలేదు.
— సనాతని ఠకురైన్ ❤️ (@mahisinghup) June 13, 2025
అంతా కాలి బూడిద అయినా భగవంతుడు తన ఉనికిని చూపించాడు. pic.twitter.com/kvlsiRL7gQ
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, ఫ్రాన్సుకు చెందిన ఏడుగురు, ఒక కెనడా పౌరుడు ఉన్నారు. విమానం రన్వే 23 నుండి 13:39 గంటలకు అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. కేవలం 5 నిమిషాల తర్వాత మేఘాని నగర్ లోని ఒక నివాస ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది.
మెడికల్ కాలేజీ భవనం మీద కూలడం అందులోనూ అది లంచ్ సమయం కావడంతో అక్కడ సైతం ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 50 నుంచి 60 మంది మెడికోలు గాయపడగా వారిని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ వారిలో 24 మంది చనిపోయారని గురువారమే వెల్లడైంది. మనకు ప్రాణాలు పోసే డాక్టర్లు వారికి సంబంధమే లేని ఓ ప్రమాదంలో మృతిచెందడం విషాదాన్ని నింపింది. డీఎన్ఏ టెస్టులు చేసి మృతదేహాలను గుర్తిస్తున్నారు అధికారులు.























