Golden Doors For Ram Mandir: అయోధ్య రామాలయానికి 42 స్వర్ణ ద్వారాలు - భక్తులకు స్వాగతం పలుకుతున్నట్టు తలుపుల డిజైన్
Ramlala Pran Pratishtha: ఈనెల 22న జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు యావత్ దేశం వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆలయానికి సంబంధించిన విశేషాలు భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
Ram Mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరానికి బంగారు ద్వారాలు ఆకట్టుకోనున్నాయి. ఆలయంలో 42 బంగారు ద్వారాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం వందకిలోల బంగారంతో ద్వారాలకు పసిడి పూత పూశారు. మొదటి స్వర్ణ ద్వారం ఫోటోలు ఇటీవల కాలంలోనే ట్రస్ట్ విడుదల చేసింది. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు తలుపులు డిజైన్ చేశారు.
అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 22న జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు యావత్ దేశం వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆలయానికి సంబంధించిన విశేషాలు భక్తులకు ఆధ్యాత్మిక పారవశ్యానికి కారణమవుతున్నాయి.
అయోధ్య రామాలయానికి 42 బంగారు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 46 ద్వారాలుండే రామాలయంలో గుడి మెట్ల దగ్గర ఉన్న నాలుగు తలుపులను మినహాయించిన మిగిలివన్నీ బంగారు పూత పూసి తయారు చేశారు. ఇందు కోసం వందకిలోల బంగారాన్ని వినియోగించారు.
బంగారు పూత పూసిన రామాలయం మొదటి ద్వారం ఫోటోలు ఈ మధ్య రామాలయ ట్రస్ట్ విడుదల చేసింది. రామయ్య వైభవం ఎలా ఉండనుందో తెలియచేసేలా ఈ ద్వారాల నిర్మాణం పూర్తైంది. పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉండే ఈ తలుపులపై రెండు ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి.ద్వారం పై భాగంలో రాజభవనం దానికి అటు ఇటూ ఇద్దరు ద్వారపాలకులు నిలబడి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి భక్తులకు ఆలయం లోపలకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి.