Social Media Policy: దేశ వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేస్తే బ్లాక్! కఠిన చర్యలు: త్వరలో కేంద్రం కొత్త పాలసీ
ప్రభుత్వం దేశ వ్యతిరేక వీడియోలు, పోస్టులు షేర్ చేసే వారిపై చర్యలు తీసుకోనుంది. దీని కోసం హోం మంత్రిత్వ శాఖ త్వరలో ఒక విధానం తీసుకురానుంది.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సంఘ విద్రోహ శక్తులు, దేశానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇకనుంచి సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలు, లేదా విషయాలను పోస్ట్ చేసే వారు ఇకపై తప్పించుకోలేరు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇలాంటి కంటెంట్ ను అడ్డుకునేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసే సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తారు. అదే విధంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
పహల్గాంలో ఉగ్రదాడి తరువాత కేంద్రం అప్రమత్తమైంది. మన మధ్యే ఉంటూ దేశానికి నష్టం కలిగించే వారిపై ఫోకస్ చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాతో పాటు అనేక వెబ్‌సైట్‌లలో టెక్ట్స్, వీడియో కంటెంట్ అప్‌లోడ్ అవుతుందని కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఇలాంటి పనులు చేసే వారిపై త్వరలో చర్యలు తప్పవని తెలుస్తోంది. సోషల్ మీడియాకు సంబంధించి హోంశాఖ త్వరలో కొత్త పాలసీ రూపొందిస్తోంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, హోంశాఖ ఉన్నతాధికారులు పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాన్ని తెలిపారు.
నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
దేశ వ్యతిరేక వ్యక్తులపై సోషల్ మీడియాలో నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ కమిటీకి సమాచారం అందించారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూతో సహా చాలా మంది దేశ వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు మరియు వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కొత్త విధానం వచ్చిన తర్వాత, అలాంటి వ్యక్తులపై అదుపు చేయవచ్చు.
సోషల్ మీడియా కంపెనీలతో చర్చలు
అమెరికా ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కూడా చర్చలు జరుపుతోంది. సోషల్ మీడియా కంపెనీలు తమ స్థాయిలో నిఘా ఉంచాలని, దేశానికి వ్యతిరేక విషయాలను, విధ్వేషం చిమ్మేలా వారి ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సిబిఐ, ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసులు, అంతర్గత భద్రతకు సంబంధించిన ఇతర ఏజెన్సీలు భారత్ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను అడ్డుకునేందుకు అప్రమత్తం అయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా, మతాల మధ్య విధ్వేషం చిమ్మేలా కంటెంట్ పోస్ట్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడంతో పాటు వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు.
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నాశనం చేశాయి భారత బలగాలు. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక దేశ వ్యతిరేక పోస్టులను కేంద్రం గుర్తించింది. పలు రాష్ట్రాల్లో యూట్యూబర్లను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను అరెస్ట్ చేసి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. కొందరు యూట్యూబర్లు పాక్ నుంచి డబ్బు తీసుకుని వారికి అనుకూల సమాచారం, దేశానికి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. వారికి పాక్ తో ఉన్న లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది.






















