NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్ సమాచారంతో దాడులు
NIA Raids: దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 51 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్, ఉగ్రవాదుల సమాచారంతో దాడులు చేస్తోంది.
NIA Raids: ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్, ఉగ్రవాదుల సమాచారంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పంజాబ్ లోని 30 ప్రాంతాలకు పైగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖలిస్థానీకి మద్దతు ఇస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, అర్ష్‌దీప్ దల్లా గ్యాంగులకు చెందిన 51 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.
పంజాబ్ లోని మోగా జిల్లా టక్తుపురా మద్యం కాంట్రాక్టర్ ఇంటిపై తెల్లవారుజామున దాడులు చేశారు. అర్ష్‌దీప్ దల్లా ఈ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేయగా.. అతడు అర్ష్‌దీప్ దల్లాకు డబ్బు ఇచ్చినట్లు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. అర్ష్ దల్లా ముఠాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ విషయంలో భారత్- కెనడా మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ఆ సంస్థకు మద్దతు ఇస్తున్న ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర భారతంలోని 6 రాష్ట్రాల్లోని ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో సోదాలు చేస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు.. 6 రాష్ట్రాల్లో 51 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో దాడులకు దిగారు.
అర్ష్‌దీప్ దల్లా, గౌరవ్ పాటియాల్ లాంటి ఖలిస్థానీ మద్దతు గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో ఉంటున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే దేశంలో హత్యలు, దాడులు, మారణహోమాలు సృష్టించడానికి ఖలిస్థానీ అనుకూల వ్యక్తులతో వారు ఎప్పుడూ టచ్ లోనే ఉంటారని, అవసరమైనప్పుడు వారితో హత్యలు, దాడులు చేయిస్తారని అధికారులు చెబుతున్నారు.
కెనడాకు చెందిన తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న 43 మంది వ్యక్తులపైనా ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ మేరకు వారి పేర్లు, ఫోటోలతో సహా ఎన్ఐఏ అధికారులు పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. ఇటీవలె వారి వివరాలను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆయా వ్యక్తుల ఆస్తుల వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలను అధికారులు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆయా వ్యక్తుల ఆస్తులను జప్తు చేసేందుకు వివరాలు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీరి పేరుతో కానీ, వారి అనుచరుల పేర్లతో ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, వ్యాపార భాగస్వామ్యాలు, వారితో పని చేసే వ్యక్తులు, ఉద్యోగులు, కలెక్షన్ ఏజెంట్ల వివరాలు తెలిస్తే చెప్పాలని ఎన్ఐఏ కోరింది. ఎన్ఐఏ పోస్టు చేసిన చిత్రాల్లోని ముఠా సభ్యులు చాలా మంది కెనడాలోనే ఉన్నారు. వారు అక్కడే ఉంటూ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 21వ తేదీన పంజాబ్, హర్యానాలోని వెయ్యి ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్ఐఏ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లలో ఒకడైన గోల్డీ బ్రార్.. ఆస్తులపై ఎన్ఐఏ గురి పెట్టింది. ఇటీవల కెనడాలోని విన్ని పెగ్ లో హత్యకు గురైన సుఖా దునికే హత్య వెనక కూడా గోల్డీ బ్రార్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎన్ఐఏ ట్విట్టర్ లో పోస్టు చేసిన గ్యాంగ్‌స్టర్ లు చాలా మంది కెనడాలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఖలిస్థానీలతో, వారి సానుభూతిపరులతో సంబంధాలు ఉన్నాయి.