Train Accident: మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
Lokmanya Tilak Terminus: అస్సాంలోని దిమా హసావో జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 బోగీలు పట్టాలు తప్పాయి.
Agartala Lokmanya Tilak Terminus Express Derailed: భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అస్సాంలోని దిమా హసావో జిల్లాలో గురువారం లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ (Lokmanya Tilak Terminus) పట్టాలు తప్పింది. అగర్తలా (Agartala) నుంచి ముంబయికి (Mumbai) బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పాయి. దిబలోంగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3:55 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని.. దీనికి గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. పవర్ కార్, ఇంజిన్‌తో పాటు మొత్తం 8 కోచ్‌లు పట్టాలు తప్పాయన్నారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్ - బాదర్‌పూర్ సింగిల్ - లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపేసినట్లు వెల్లడించారు.
8 coaches of Agartala-Lokmanya Tilak Express derails in Assam
— ANI Digital (@ani_digital) October 17, 2024
Read @ANI Story | https://t.co/kD72eltdz3#Derailment #Train #AgartalaLokmanyaTilak pic.twitter.com/eMFJ20CAlH
కాగా, తమిళనాడులోని చెన్నై శివారులో ఈ నెల 11న (శుక్రవారం) రాత్రి మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా దర్బంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12578).. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 వరకూ భోగీలు పట్టాలు తప్పాయి. 2 భోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా.. వారిని రైల్వే సిబ్బంది సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రైలు ప్రమాదంపై ఏదైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని ద.మ రైల్వే సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది.