Actress Gautami: పార్టీలో చేరిన నటి గౌతమికి కీలక బాధ్యతలు అప్పగించిన అన్నాడీఎంకే
AIADMK Leader Actress Gautami | అన్నాడీఎంకే నాయకురాలు, నటి గౌతమికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. పాలసీ ఔట్ రీచ్ డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల్ని గౌతమికి అప్పగించినట్లు ప్రకటించారు.
Tamil Nadu Politics | చెన్నై: సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడి కొన్ని నెలల కిందట అన్నాడీఎంకేలో చేరారు. ఈ క్రమంలో నటి గౌతమికి ఏఐఏడీఎంకే కీలక పదవి ఇచ్చి గౌరవించింది. గౌతమిని అన్నాడీఎంకే పార్టీ పాలసీ ఔట్ రీచ్ డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి ఏఐఏడీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాదే అన్నాడీఎంకేలో చేరిన గౌతమి
తమిళం, తెలుగుతోపాటు పలు భాషల్లో చిత్రాల్లో నటించిన గౌతమి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆమె మోదీ రాజకీయాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరి కొంత కాలంలో పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత బీజేపీతో విభేదాలు రావడంతో కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమి చేరారు.
ఏఐఏడీఎంకే కీలక ప్రకటన
అన్నాడీఎంకే తాజాగా పార్టీలో కొందరికి బాధ్యతలు అప్పగించింది. నటి గౌతమిని అన్నాడీఎంకే యొక్క విధాన ప్రచార డిప్యూటీ సెక్రటరీగా నియమించినట్లు ఆ ప్రకటనలో పార్టీ తెలిపింది. తడ దు. పెరియసామిని ఎంజీఆర్ ఫోరం (MGR Forum) డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలు కూడా అప్పగించినట్లు స్పష్టం చేశారు. గౌతమితో పాటు పెరియసామి సైతం కొన్ని నెలల కిందట బీజేపీని వీడి అన్నాడీఎంకేలో చేరారని తెలిసిందే. వీరితోపాటు ఫాతిమా అలీని అన్నాడీఎంకే మైనార్టీ సంక్షేమ విభాగం డిప్యూటీ సెక్రటరీగా, సాన్యాసిని ఏఐఏడీఎంకే అగ్రికల్చర్ క్లబ్ డివిజన్ డిప్యూటీ సెక్రటరీగా నియమించినట్లు అన్నాడీఎంకే అధిష్టానం ప్రకటించింది.
மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் 'புரட்சித் தமிழர்' திரு. @EPSTamilNadu அவர்களின் முக்கிய அறிவிப்பு. pic.twitter.com/UUpgr1DGkH
— AIADMK - Say No To Drugs & DMK (@AIADMKOfficial) October 21, 2024
2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
తమిళనాడు శాసనసభ ఎన్నికలపై అన్నాడీఎంకే ఫోకస్ చేసింది. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పార్టీని పటిష్టం చేయడానికి పార్టీలో పదవులు అప్పగిస్తూ, ఎన్నికలకు క్యాడర్ ను అన్నాడీఎంకే సిద్ధం చేస్తోంది. చురుగ్గా పనిచేసే వారిని గుర్తించి, పార్టీలో పదవులు అప్పగిస్తోంది. అన్నాడీఎంకే విధానాలను ప్రచారం చేయడానికి విధాన ప్రచార కార్యదర్శి పదవికి ముఖ్య బాధ్యతలు అప్పగిస్తారు. ఈ క్రమంలో నటి గౌతమిని పాలసీ ఔట్‌రీచ్ డిప్యూటీ సెక్రటరీ పదవి వరించింది. పాలిటిక్స్ లో అనుభవం ఉండటంతో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని గౌతమికి బాధ్యతలు దక్కాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎంపీగా పోటీ చేయడానికి గౌతమి ఆసక్తి చూపారు. అయితే బీజేపీ ఆమెకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తితో ఆమె పార్టీని వీడారు. ఆమెతో పాటు పెరియస్వామి సైతం బీజేపీని వీడి అన్నాడీఎంకేలో చేరి ఎన్నికల్లో ప్రచారం చేశారు. తాజాగా పార్టీలో పదవులు దక్కించుకున్నారు.
Also Read: Telangana Jobs: బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్ పావులు కదుపుతున్నారు. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కేవలం మంత్రి పదవిలో కాదు డిప్యూటీ సీఎంగా తన తరువాతి నేత అని డీఎంకే సీనియర్లకు సంకేతాలు పంపించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. సనాతన ధర్మంపై దక్షిణాదిన ఉదయనిధి వర్సెస్ పవన్ కళ్యాణ్ అని ప్రచారం ఊపందుకుంది.