Mexico Bus Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం- 18 మంది మృతి- బస్సులో ఆరుగురు భారతీయులు
Mexico Bus Accident: పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది.
Mexico Bus Accident: పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో 18మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఎలైట్ ప్యాసింజర్ లైన్‌కు చెందిన బస్సు రాజధాని టెపిక్‌కు కొంత దూరంలో హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో టిజువానా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 40 మంది ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారు. అయితే మృతుల వివరాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మృతుల్లో భారతీయులు ఉన్నారా లేదో తెలియాల్సి ఉంది.
నయారిత్ రాష్ట్ర భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. టెపిక్‌కు కొంత దూరంలో హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో 40 మంది ప్రయాణికులతో టిజువానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఇందులో 18 మంది మరణించినట్లు చెప్పారు. మృతుల్లో 14 మంది పెద్దలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మరో 22 మంది ప్రయాణికులు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. లోయ దాదాపు 50 మీటర్లు (164 అడుగులు) లోతు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని వివరించారు. ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియదన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అంతకుముందు గురువారం నయారిట్ సివిల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక సిబ్బంది హైవేపై అంబులెన్స్‌లు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద బాధితులను లోయ నుంచి బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్‌ల్లో ఆస్సత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ఫొటలోను అధికారుల విడుదల చేశారు. ప్రమాదం జరిగిన బస్సులో ఆరుగురు భారతీయులు ఉన్నారని వారి వివరాలు తెలియాల్సి ఉందని నయారిత్ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదంపై బస్ కంపెనీ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ స్పందించలేదు.
ప్రమాదానికి కారణమని డ్రైవర్ అతివేగమే అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. గత నెలలో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 29 మంది మరణించారు. ఫిబ్రవరిలో వలసదారులను దక్షిణ అమెరికా నుంచి మధ్య అమెరికా తరలిస్తుండగా మెక్సికోలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సైతం 17 మంది మరణించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial