India Wheat Flour Export: గోధుమ పిండినీ ఎక్స్‌పోర్ట్ చేయటానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
ఇప్పటికే గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం, గోధుమ పిండిపైనా అవే ఆంక్షలు అమలు చేయనుంది.
గోధుమ పిండి ఎగుమతులపై ఆంక్షలు ఇందుకేనా..?
గోధుమ ఎగుమతులను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు గోధుమ పిండి ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈనెల 12వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయంగా గోధుమల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించింది. ఎప్పుడైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి గోధుమలకు కొరత ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు ఎగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి సరఫరా నిలిచిపోవటం వల్ల అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ఏడాది మే ముందు వరకూ గోధుమలు భారీగానే ఎగుమతి చేసింది భారత్. ఈ కారణంగా దేశీయంగా నిల్వలు నిండుకున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే, ఇక్కడా కొరత ఏర్పడుతుందని గ్రహించిన కేంద్రం, వెంటనే ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు గోధుమ పిండి విషయంలోనూ ఆ ఆంక్షల్ని కొనసాగించింది.
బ్లాక్‌మార్కెట్‌ను సృష్టించే అవకాశం..
గోధుమ పిండి ఎగుమతిదారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు సరఫరా చేయటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా నిల్వలు గమనించుకుని, నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వ అనుమతితోనే ఎగుమతి చేయాలని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఉన్న కొరతతో కొందరు కావాలనే బ్లాక్ మార్కెట్‌ను సృష్టించే ప్రమాదముందని అంటోంది కేంద్రం. ఈ కారణంగా నాణ్యత లోపించే అవకాశముందని అభిప్రాయపడింది. మేలో భారత్ గోధుమలు ఎగుమతులు నిషేధించిన సమయంలో అంతర్జాతీయంగా ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఈ నిర్ణయంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. భారత్ మాత్రం దేశీయంగా ధరల్ని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా చూస్తే గోధుమల సరఫరాలో పావువంతు వాటా రష్యా, చైనాలదే. చైనా తరవాత ఆ స్థాయిలో గోధుమలు పండిస్తున్న దేశం భారత్. గతేడాది 109 మిలియన్ టన్నుల గోధుమలు పండించిన భారత్, కేవలం 7 మిలియన్ టన్నుల్ని ఎగుమతి చేసింది.
ఏటా గోధుమల సాగు బాగానే సాగుతున్నా, ఈ ఏడాది వేసవిలో మాత్రం కొంత తగ్గింది. విపరీతమైన వేడిగాలులతో సాగుపై ప్రతికూల ప్రభావం పడింది. దాదాపు 5% మేర దిగుబడి తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ఏప్రిల్‌లో 26వేల టన్నుల గోధుమ పిండిని భారత్ ఎగుమతి చేసింది. ఈ ఏడాది అదే సమయంలో ఏకంగా 96వేల టన్నులు ఎగుమతి చేసింది. అంటే 2022 ఆర్థిక సంవత్సరంలో గోధుపిండి ఎగుమతులు, గోధుమల ఎగుమతులకు దీటుగా పెరిగాయని స్పష్టమవుతోంది.