(Source: Poll of Polls)
ఆఫ్రికన్ దేశం నైగర్‌లో తిరుగుబాటు, భారతీయుల ఆందోళన - వెనక్కి వచ్చేయాలని సూచించిన విదేశాంగ శాఖ
Niger Violence: నైగర్‌లో ఉన్న భారతీయులు వెంటనే ఇండియాకి వచ్చేయాలని విదేశాంగ శాఖ సూచించింది.
Niger Violence:
నైగర్‌లో తిరుగుబాటు
ఆఫ్రికన్ దేశం నైగర్‌లో హింసతో అట్టుడుకుతోంది. తిరుగుబాటుతో దేశమంతా సతమతం అవుతోంది. ఈ అల్లర్లతో అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఇదే పిలుపునిచ్చాయి. నైగర్ నుంచి వెనక్కి వచ్చేయాలని తమ పౌరులకు సూచించింది ఫ్రాన్స్. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
"భారత ప్రభుత్వం నైగర్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వదిలి వచ్చేయండి. ప్రస్తుతానికి విమానాలు పంపి తీసుకొచ్చేందుకు వీల్లేకుండా పోయింది. సరిహద్దులు దాటుకుని వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించండి. నైగర్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వాళ్లు కూడా కొన్ని రోజులు ఆగితే మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ తప్పదు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులున్నట్టు మాకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి వాళ్లంతా సేఫ్‌గానే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేందుకు భారత్ తరపున అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం."
- అరింద్ బగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి
#WATCH | MEA spokesperson Arindam Bagchi says, "Government of India is closely monitoring ongoing developments in Niger. In light of the prevailing situation, Indian nationals whose presence is not essential are advised to leave the country as soon as possible. They may bear in… pic.twitter.com/vjqzqxdyY2
— ANI (@ANI) August 11, 2023
ఇదీ జరిగింది...
గతంలో ఫ్రాన్స్ అధీనంలో ఉన్న నైగర్ 1960లో స్వాతంత్య్రం పొందింది. 2021లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలూ జరిగాయి. మహమ్మద్ బజోమ్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే...ఆ దేశ సైన్యం మాత్రం ఆయనపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఉగ్రకార్యకలాపాలకు ఆయన సహకరిస్తున్నారని ఆరోపిస్తోంది. దేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవడమే కాకుండా...బజోమ్స్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. అప్పటి నుంచి అంతర్జాతీయంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఫ్రాన్స్ ఈ తిరుగుబాటుని పూర్తిగా వ్యతిరేకించింది. రష్యా మాత్రం సమర్థించింది. ఇప్పటికే నాలుగు సార్లు ఆ దేశంలో తిరుగుబాట్లు జరిగాయి. ప్రస్తుతం ఆ దేశ సరిహద్దులు మూసేశారు. గగనతలాన్నీ మూసి వేస్తున్నట్టు సైన్యం ప్రకటించింది. యురేనియం నిల్వల్లో అగ్రగామిగా ఉన్న నైగర్‌లో ఈ అనిశ్చితి అటు అగ్రరాజ్యాన్నీ ఇబ్బంది పెడుతోంది. భారీగా యురేనియంని ఎగుమతి చేసే నైగర్‌లో పరిస్థితులు అదుపులోకి వస్తేనే అంతర్జాతీయంగా కాస్త అలజడి తగ్గే అవకాశాలున్నాయి. ఈ తిరుగుబాటుకి కొన్ని ఆఫ్రికన్ దేశాలు మద్దతునివ్వడం మరింత ఆందోళనకరంగా మారింది. స్పెయిన్, ఇటలీ దేశాలు అప్రమత్తమై తమ పౌరుల్ని సురక్షితంగా సొంత దేశానికి తరలించే ఏర్పాట్లు చేసుకుంటోంది.
Also Read: Eris Covid Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్