India Is Best : ఆ విషయంలో అమెరికా కన్నా ఇండియానే బెస్ట్..! నెక్ట్స్ టార్గెట్ చైనానే..
ప్రపంచ తయారీ రంగంలో చైనాదే అగ్రస్థానం. అయితే ఇప్పుడు భారత్ కూడా ఆ స్థానం కోసం పోటీ పడనుంది. తయారీ రంగానికి చైనా తర్వాత భారతే అనుకూలమైన దేశంగా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది.
ఇండియా అమెరికాను అధిగమిస్తోంది. తాజాగా తయారీ రంగానికి అద్భుతమైన అనుకూలమైన వాతావరణం ఉన్న దేశంలో అమెరికా కన్నా ఇండియాకే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ ఎజెన్సీ కుష్మన్ అండ్ వికీఫీల్డ్ సంస్థ ఈ రేటింగ్స్ ప్రతీ ఏడాది ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఉన్న ఆసియా-పసిఫిక్ లోని 47 దేశాలలో ప్రపంచ తయారీకి అత్యంత ప్రయోజనకరమైన ప్రదేశాల్లో అమెరికా కన్నా ఇండియా ముందు ఉంది. ముందుగా ఉండటం కాదు 47 దేశాల్లో భారత్ రెండో స్థానం సాధించింది. మొదటి స్థానంలో తయారీ రంగానికి కేంద్రంలాంటి చైనా ఉంది.
భారత్ తర్వాతి స్థానాల్లో కెనడా, చెక్ రిపబ్లిక్, ఇండోనేషియా, లిథువేనియా, థాయిలాండ్, మలేషియా, పోలాండ్ ఉన్నాయి. అమెరికా ఆ తర్వాతి స్థానంలో ఉంది. గత సంవత్సరం నివేదికలో అమెరికా రెండవ స్థానంలో ఉండగా, భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఇప్పుడు అమెరికా ఎక్కడికో పడిపోయింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని దేశాల్లో భారత్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడానికి అవసరమైన వాతావరణం ఉందని పెట్టుబడిదారులు గుర్తిస్తున్నారని కుష్మన్ అండ్ వికీఫీల్డ్ అంచనా వేసింది. అవుట్‌సోర్సింగ్ అవసరాలను తీర్చడమే కాదు.. అద్భుతమైన మానవవనరులు ఉండటం కూడా దేశానికి ప్లస్ పాయింట్‌గా మారిందని అంచనా వేస్తున్నారు.
తయారీ, వ్యాపార వాతావరణం పూర్తిగా స్కిల్డ్ లేబర్, నిర్వహణ ఖర్చులు , రాజకీయ, ఆర్థిక పర్యావరణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇతర దేశాల్లో మ్యాన్ పవర్ దొరకదు.. దొరికినా చాలా ఎక్కువ ఖర్చు వారి కోసం చేయాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం అన్ని రకాల వనరులు చౌకగానే లభిస్తాయి. ఇది ఉత్పాతక సంస్థలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఫార్మా, రసాయనాలు, ఇంజనీరింగ్ రంగాలలో ఇప్పటికే ఇతర దేశాలలో స్థాపించిన అనేక ప్లాంట్లను ఇండియాకు తరలించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
చైనా - అమెరికా మధ్య ట్రేడ్ వార్ జరిగిన సమయంలో పెద్ద ఎత్తున అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఆంక్షలు విధించారు. అప్పట్నుంచి చైనాలో తయారీని చేపట్టిన అనేక కంపెనీలు.. ఒకే చోట ఉండటం కన్నా ఇతర చోట్ల కూడా ప్లాంట్లు పెట్టుకోవాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారందరికీ ఇండియా ఓ మంచి గమ్యస్థానంలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అంశం... నివేదిక ద్వారా వెల్లడయింది. ఇటీవలి కాలంలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే కారణం అయిఉండవచ్చని భావిస్తున్నారు.