Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్
Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా.. నేనూ ఇక్కడే జన్మించా నని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శుభ్ నీత్ సింగ్.
![Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్ India is My Country too Disheartened Singer Shubh After India Tour Cancelled Canada Singer Shubh: భారత్ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్ శుభ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/afc813efe096fb96fb2c35a9a7816cd01695365715124838_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్, కెనడా మధ్య ఏర్పడిన దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో ఉంటున్న పంజాబీ సింగర్ శుభ్‌నీత్ సింగ్ భారత పర్యటనను స్పాన్సర్లు రద్దు చేశారు. శుభ్ ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు రావడంతో అతడి పర్యటన పట్ల భారత్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అతడి టూర్‌ను రర్దు చేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో శుభ్‌నీత్ సింగ్ స్పందించారు. తన పర్యటన రద్దవ్వడం తనకు చాలా బాధ కలిగించిందంటూ సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పొస్ట్ చేశారు.
శుభ్ నీత్ తన పోస్ట్‌లో..'పంజాబ్‌కు చెందిన ఓ యువ ర్యాపర్ సింగర్‌గా నా మ్యూజిక్‌ను ప్రపంచ వేదికలపై ప్రదర్శించడం నా కల. ఇటీవల జరిగిన పరిణామాలు నన్ను ఎంతగానో బాధించాయి. నా బాధను తెలియజేయడానికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నా ఇండియా టూర్ రద్దవ్వడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. నా దేశంలో ప్రజల ముందు ప్రదర్శన ఇవ్వాలని ఎంతో ఉత్సాహపడ్డా. గత రెండు నెలలుగా మనస్సు పెట్టి ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. భారత్ నా దేశం కూడా. నేను ఇక్కడే జన్మించాను. ఇక్కడ నా గురువులు, పూర్వీకులు ఉన్నారు. పంజాబ్ నా ఆత్మ. పంజాబ్ నా రక్తం. ఈ రోజు నేను ఏదైతే ఉన్నానో, అది పంజాబీ అవ్వడం వల్లే. పంజాబీలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారు దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాపై వచ్చిన ఆరోపణలు నన్నెంతో బాధించాయి. అయితే వాటికి నేను భయపడను' అని శుభ్ పోస్ట్ చేశారు.
శుభ్‌నీత్ సింగ్ పంజాబ్ నుంచి కొన్నేళ్ల క్రితమే కెనడా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడి నుంచి తన ర్యాప్ సింగింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ర్యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తొలిసారిగి భారత్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవ్వగా భారత్-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో అతడి టూర్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇటీవల అతడు ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో శుభ్ నీత్‌పై భారత్‌లో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అతడి పర్యటనపై వ్యతిరేకత వ్యక్తమైంది. అతడి ప్రదర్శనలు అడ్డుకోవాలని డిమాండ్లు కూడా వచ్చాయి. దీంతో బుక్‌మై షో అతడి పర్యటన రద్దు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, సురేశ్ రైనా తదితరులు శుభ్‌నీత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు.
కోర్డెలియా క్రూయిజ్ లో నిర్వహించనున్న క్రూయిజ్ కంట్రోల్ 4.0 ఈవెంట్ లో భాగంగా శుభ్ ముంబై లో సెప్టెంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. స్టిల్ రోలిన్ ఇండియా టూర్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా ఇతర 12 ప్రధాన భారతీయ నగరాల్లో మూడు నెలల పాటు ప్రదర్శనలను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో భారత్ - కెనడా మధ్య వివాదం తలెత్తడం, దానికి ఆజ్యం పోసేలా శుభ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో బుక్‌మైషో అతడి పర్యటనను రద్దు చేసింది. శుభనీత్ సింగ్ భారత పర్యటనకు బుక్‌మైషో స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. 7 -10 రోజుల్లో టికెట్ల డబ్బులను తిరిగి చెల్లిస్తామని తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)