నిజ్జర్ హత్యలో కెనడా వద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేనే లేదు, గిల్లి కయ్యం పెట్టుకున్నారు - ఎక్స్‌పర్ట్
India Canada Tensions: నిజ్జర్ హత్య కేసులో కెనడా వద్ద సరైన ఆధారాల్లేవని యూఎస్ ఇండియా పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సీఈవో ముకేశ్ అఘి వెల్లడించారు.
India Canada Tensions:
భారత్ కెనడా ఉద్రిక్తతలు..
కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ హస్తం ఉందన్న జస్టిన్ ట్రూడో ఆరోపణలపై ఇప్పటికీ వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై US-India Strategic Partnership Forum సీఈవో ముకేశ్ అఘి స్పందించారు. ట్రూడో ఆరోపణల్ని కొట్టి పారేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అలా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. కచ్చితమైన ఆధారాలు కెనడా వద్ద లేవని, ఈ కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం చాలా దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రిని అర్థం చేసుకుని వెనక్కి తగ్గితే బాగుంటుందని హితవు పలికారు.
"కెనడా పార్లమెంట్‌లో జస్టిన్ ట్రూడో అనవసరపు చర్చ చేశారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనకాల భారత్ ఉందని ఆరోపించారు. పోనీ అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయా అంటే అదీ లేదు. కచ్చితమైన ఎవిడెన్స్ లేకుండా అలా ఎలా ఆరోపిస్తారు..? ఓ దేశ ప్రధాని పార్లమెంట్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇప్పటి వరకూ తమ ఆరోపణలు నిజమే అని నిరూపించుకోవడంలోనూ విఫలమయ్యారు"
- ముకేశ్ అఘి, అమెరికా భారత్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సీఈవో
VIDEO | "An important issue (Nijjar's killing allegations) was brought without any concrete evidence into the Parliament (of Canada). It is unfortunate that a PM of a country alleges something and does not come up with evidence," says Mukesh Aghi, President and chief executive… pic.twitter.com/VaOKZT8qZH
— Press Trust of India (@PTI_News) October 7, 2023
పెరుగుతున్న దూరం..
ఈ వివాదం కారణంగా భారత్, కెనడా మధ్య ఉన్న మైత్రి చెడిపోతోందని అన్నారు ముకేశ్ అఘి. రెండు దేశాలకూ వాణిజ్యావసరాలున్నాయని గుర్తు చేశారు. 30 వేల మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చదువుతున్నారని...భారత్‌లో కెనడా 55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని వివరించారు. కాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచించి శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ వివాదం కారణంగా భారత్, అమెరికా మధ్య ఉన్న మైత్రి కూడా కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కెనడా అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు.
"భారత్ అమెరికా మధ్య చాలా విధాలుగా మైత్రి కొనసాగుతోంది. కెనడాతో ఉన్న వివాదం కారణంగా అమెరికాలోని భారతీయులపైనా ప్రభావం పడే అవకాశముంది. ఇదే విధంగా ఉద్రిక్తతలు కొనసాగితే ఈ ప్రభావం పెరిగే ప్రమాదముంది"
- ముకేశ్ అఘి, అమెరికా భారత్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సీఈవో
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడా మధ్య నడుస్తున్న దౌత్యవివాదంపై అమెరికా కెనడాకు అనుకూలంగా స్వరం మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్ సహకరించాలని గతంలో పలుమార్లు సూచించింది. ఇరు దేశాలు తమకు ముఖ్యమేనని, రెండూ తమకు మిత్ర దేశాలే అని చెప్తున్నప్పటికీ కెనడాకు సహకరించమని భారత్‌కు చెప్తూ వస్తోంది. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది అమెరికా. కెనడా భారతపై చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై పూర్తిగా దర్యాప్తు జరగాల్సిందేనని అమెరికా వెల్లడించింది.
Also Read: Caste Survey: బిహార్ బాటలో రాజస్థాన్, కులగణనకు ఓకే చెప్పిన సీఎం గెహ్లాట్