Caste Survey: బిహార్ బాటలో రాజస్థాన్, కులగణనకు ఓకే చెప్పిన సీఎం గెహ్లాట్
Caste Survey: బిహార్ తరహాలోనే రాజస్థాన్ కులాల సర్వేకు సిద్ధమవుతోంది. ఎన్నికల లోపు కులగణన చేపడతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్రవారం చెప్పారు.
![Caste Survey: బిహార్ బాటలో రాజస్థాన్, కులగణనకు ఓకే చెప్పిన సీఎం గెహ్లాట్ Like Bihar, caste survey will be carried out in Rajasthan, says Ashok Gehlot Caste Survey: బిహార్ బాటలో రాజస్థాన్, కులగణనకు ఓకే చెప్పిన సీఎం గెహ్లాట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/07/ead5ce9a12f8d313f6d371fb26f7790c1696647737473798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Caste Survey: బిహార్ తరహాలోనే రాజస్థాన్ కులాల సర్వేకు సిద్ధమవుతోంది. ఎన్నికల లోపు కులగణన చేపడతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుక్రవారం చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బిహార్ తరహాలో రాజస్థాన్‌లో కులాల సర్వే నిర్వహించేందుకు అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనను ఆమోదించినట్లు అశోక్ గెహ్లాట్ తెలిపారు.
రాజస్థాన్ కొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో గెహ్లాట్ కుల గణన ప్రకటన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆయన కులాల సర్వేకు అనుకూలంగా మాట్లాడారు. గత ఆగస్టులో అసలైన, ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గాలకు ఆరు శాతం అదనపు రిజర్వేషన్లను ప్రకటించారు. అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. కులాల సర్వే ముఖ్యమని, అందుకనుగుణంగా ప్రభుత్వం విధానాలు, పథకాలను రూపొందించగలదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కులాల సర్వేను సమర్థించింది. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన తరగతులకు (OBC) ప్రాధాన్యతనిస్తూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే, బీహార్‌లో నిర్వహించిన కసరత్తు తరహాలో కులాల సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
బిహార్ లెక్కలు ఇవీ
బిహార్‌లో బీసీలు 63 శాతం ఉన్నట్లు వెల్లడైంది. బిహార్‌లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బిహార్ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది.
హిందువులు 81 శాతం, ముస్లింలు 17 శాతం ఉన్నారు. హిందువులు 10,71,92,958 మంది ఉన్నారు. ముస్లింల సంఖ్య 2,31,49,925గా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 17 శాతం మంది ఉన్నారు. ముస్లింలతో పోలిస్తే హిందువుల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ. క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కులు 14753, బౌద్ధులు 1,11,201, జైనులు 12,523 మంది ఉన్నారు.
అలాగే జనాభాలో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతం ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారు 27.13 శాతం ఉన్నారు. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల (SCs) జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)