Ideas of India 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా తగ్గదు - దేవేంద్ర ఫడణవీస్
Ideas of India 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశమే లేదని దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు.
Ideas of India Summit 2024: ABP Network నిర్వహిస్తున్న Ideas of India Summit లో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. 2021లో తమకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే రాష్ట్ర ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని చూసే వాళ్లని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరవాతే సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందని వెల్లడించారు. ప్రజాతీర్పుని కాదని కొందరు కావాలనే ప్రభుత్వాన్ని కూల్చేశారని, అదే జరగకపోయుంటే రాష్ట్ర పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అన్ని రాష్ట్రాలూ కలిసి కట్టుగా పని చేయాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ని ఏర్పాటు చేసేలా చొరవ చూపించారని ప్రశంసించారు దేవేంద్ర ఫడణవీస్. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే...ఏ పదవిలో ఉన్నప్పటికీ...నీతి ఆయోగ్ సమావేశాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. Maharashtra Institution for Transformation సంస్థకి కో ఛైర్మన్‌గానూ ఉన్నారు.
"రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకోని పరిణామాలు జరుగుతుంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంటారు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. 2019లో మా ప్రభుత్వం కూలకపోయుంటే రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్న ఆలోచన పెరిగింది. అదే నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటుకు కారణమైంది"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. గతంలో 48 లోక్‌సభ సీట్లలో బీజేపీ 44 చోట్ల విజయం సాధించిందని, ఇప్పుడూ అదే స్థాయిలో ఫలితాలు రాబడుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఒక్క సీటు కూడా తగ్గదని వెల్లడించారు.
"ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. మా ముందు సవాళ్లు ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ సులువుగా అధిగమిస్తాం. గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకముంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 44 చోట్ల గెలిచాం. ఈ సారి అంత కన్నా ఎక్కువే సీట్లు వస్తాయన్న విశ్వాసముంది. కానీ...ఈ లెక్క మాత్రం తగ్గదు. అజిత్ పవార్‌తో మైత్రి అనేది కేవలం రాజకీయపరమైందే. ప్రస్తుతం ఉన్న శిందే ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది"
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం
ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే, ఎడిటర్ ఇన్ చీఫ్ అతిదేబ్ సర్కార్, ABP Pvt Ltd సీఈవో ధ్రుబా ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాశ్ పాండే అతిథులందరికీ ఆహ్వానం పలికారు. అమెరికన్ బేస్‌బాల్ మూవీలోని డైలాగ్‌ని ప్రస్తావించారు. "If you make it, they will come" అంటూ అందరినీ స్వాగతించారు. ఇదే సమయంలో Ideas of India summit ప్రాధాన్యతని వివరించారు. గతంలో జరిగిన రెండు ఎడిషన్స్ విజయవంతం అయ్యాయని వెల్లడించిన అవినాశ్ పాండే...అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఎన్నికలతో పాటు వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావించారు.