Rahul Gandhi: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆప్ అభ్యర్థికే, కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi News: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థికే ఓటు వేస్తానని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Lok Sabha Elections 2024: I.N.D.I.A కూటమిలో ఐక్యత కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. మొదట్లో ఉన్నంత సఖ్యత ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇదే బీజేపీకి ప్లస్ అవుతోంది. అయితే...కేజ్రీవాల్ అరెస్ట్‌పై మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీకి గట్టిగానే సపోర్ట్ చేసింది. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేస్తానని వెల్లడించారు. అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని స్పష్టం చేశారు. కూటమిలోని పార్టీలు ఎంత సఖ్యతగా ఉన్నాయో చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష కూటమిలోని నేతలకు మద్దతు పలికారు రాహుల్ గాంధీ. కూటమి కోసం అంతా కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో పాటు ఆప్ కార్యకర్తలు ఎలాంటి విభేదాలు లేకుండా పని చేయాలని సూచించారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీకి సవాల్ విసిరారు రాహుల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి చర్చించే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమే అని..కానీ ప్రధాని మోదీ మాత్రం ముందుకు రారని మండి పడ్డారు.
"అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారు. అలాగే నేను కూడా ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తాను. మా ఐక్యత ఎలాంటిదో అందరికీ చూపిస్తాం. ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి కట్టుగా పని చేయాలి. మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లోనూ ప్రతిపక్ష కూటమి అభ్యర్థులే విజయం సాధించాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఈ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పని చేయాలి"
- రాహుల్ గాంధీ
ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీకి తీరిక లేదని చురకలు అంటించారు రాహుల్ గాంధీ. ఆయన కేవలం కొద్ది మంది కోసమే పని చేస్తున్నారని, చిన్న వ్యాపారులకు తీరని నష్టం మిగిల్చారంటూ మండి పడ్డారు. నోట్లరద్దు కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
"ప్రధాని మోదీ కేవలం 20-25 మంది కోసం మాత్రమే పని చేశారు. చిన్న వ్యాపారులందరికీ నాదొకటే ప్రశ్న. మీకు ప్రధాని మోదీ చేసిందేంటి..? జీఎస్‌టీ, నోట్ల రద్దు, రకరకాల పన్నులు అన్నీ కలిసి చిన్న వ్యాపారులను దెబ్బ తీశాయి. అదానీ అంబానీ తీసుకున్న కోట్ల రూపాయల అప్పులు మాత్రం రద్దైపోయాయి. రైల్వేతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు"
అందరూ కలిసి పని చేస్తే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేశారు రాహుల్. చైనాకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో మన మార్కెట్ ఎదగాలని అన్నారు. ఢిల్లీలోని 7 స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తుండగా మిగతా నాలుగు చోట్ల ఆప్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.