CM Jagan Gorantla Madhav: జగన్‌ను కలిసిన గోరంట్ల మాధవ్, ఉత్తిచేతులతోనే బయటికి!
Gorantla Madhav: వచ్చే ఎన్నికల్లో కనీసం అసెంబ్లీ సీటు అయినా తనకు ఇవ్వాలని సీఎం జగన్ ను గోరంట్ల మాధవ్ కోరారు. కానీ, సీటు విషయంలో గోరంట్లకు సీఎం జగన్ ఏ స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
Hindupuram Politics: సీఎం జగన్‌ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన లోక్ సభ స్థానం టికెట్ ను సీఎం జగన్ (CM Jagan) మరొకరికి కేటాయించిన సంగతి తెలిసిందే. తన స్థానం గల్లంతు కావడంతో గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) సీఎం జగన్ ను కలిశారు. తనను తప్పించడంతో వచ్చే ఎన్నికల్లో కనీసం అసెంబ్లీ సీటు అయినా తనకు ఇవ్వాలని సీఎం జగన్ ను గోరంట్ల మాధవ్ కోరారు. కానీ, సీటు విషయంలో గోరంట్లకు సీఎం జగన్ ఏ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. హిందూపురం ఎంపీ సీటు ఇప్పటికే మరొకరికి ప్రకటించారని.. అందుకే సీఎం జగన్ ను కలవడానికి వచ్చానని సమావేశం తర్వాత గోరంట్ల మాధవ్ మీడియాతో చెప్పారు. నా సీటు విషయంపై చర్చిస్తున్నామని జగన్ చెప్పినట్లుగా గోరంట్ల మాధవ్ చెప్పారు.
తొలుత సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అయిన గోరంట్ల మాధవ్ 2019కి ముందు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో ఆయన జగన్ కంట్లో పడిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా గోరంట్ల మాధవ్ కి జగన్ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. వెంటనే తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి.. గోరంట్ల మాధవ్ ఎన్నికల బరిలో నిలిచారు. అక్కడ కురుబ సామాజిక వర్గం కూడా ఎక్కువ కావడం, అదే సమయంలో వైసీపీ బాగా స్వింగ్ లో ఉండడంతో గోరంట్ల మాధవ్ సులభంగానే గెలిచారు.
కానీ, తన వ్యవహార శైలితో గోరంట్ల మాధవ్ తనను తానే దిగజార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఓ మహిళతో ఆయన న్యూడ్ కాల్ మాట్లాడినట్లు బయటికి వచ్చిన ఓ వీడియో గతేడాది సంచలనం అయింది. అందులో ఉన్నది తాను కాదని, తన ముఖాన్ని మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ కవర్ చేసుకొనే ప్రయత్నం చేసినప్పటికీ.. వైసీపీ అధిష్ఠానం మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. కానీ, అప్పుడు ఆయనపై ఎలాంటి వేటు వేయలేదు. తాజాగా ఎన్నికల సమయం కావడం.. టికెట్లు ప్రకటిస్తుండడంతో అందరూ ఊహించినట్లుగానే గోరంట్ల స్థానం గల్లంతు అయింది.