Hindu Temple in UAE: అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణం, చాలా గ్రాండ్‌గా ఉంటుందట!
Hindu Temple in UAE: అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Hindu Temple in UAE:
నిర్మాణ పనులు..
యూఏఈలోని అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణం జరుగుతోంది. దీనిపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు రివ్యూ చేస్తున్నారు కూడా. చాలా గ్రాండ్‌గా ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు వచ్చి ఈ ఆలయ దర్శనం చేసుకునేలా తీర్చి దిద్దుతున్నారు. సాదాసీదాగా కాకుండా కళ్లు చెదిరేలా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. BAPS Swaminarayan Sanstha ఈ ఆలయ నిర్మాణం చేపడుతోంది. ఈ సంస్థకు చెందిన బ్రహ్మవిహారి దాస్ దగ్గరుండి మరీ ఈ పనులను చూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈయన ఇండియాకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ గురించి చెప్పారు. ఓ హిందూ ఆలయ నిర్మాణంపై మహమ్మద్ బిన్ జాయేద్ ఇంతలా ఆసక్తి చూపుతుండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతే కాదు. దీనిపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారని వెల్లడించారు. అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణం జరుగుతుండటమే అద్భుతమైన విషయమని ఆనందం వ్యక్తం చేశారు. 1997లోనే యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ హిందూ ఆలయం ఉంటే బాగుండని అనుకున్నట్టు చెప్పారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరనుందని తెలిపారు.
మోడీకి గిఫ్ట్..
2015లోనే అబుదాబిలో ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించింది. ఆ ఏడాదే షేక్ మహమ్మద్ బిన్ యువరాజుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటనకు వెళ్లారు. అప్పుడే ఆలయ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని మోడీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. BAPS ప్రతినిధులు అప్పుడు మోడీని కలిశారు. దాదాపు 13.5 ఎకరాల్లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఆ తరవతా మరో 13.5 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. మొత్తం 27 ఎకరాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆలయంలో వెయ్యేళ్ల క్రితం నాటి పింక్ డైమండ్‌ను పొందు పరచనున్నారు.
దుబాయ్‌లో టెంపుల్..
గతేడాది విజయదశమి సందర్భంగా...దుబాయ్‌లో కొత్త ఆలయం కొలువు దీరింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ వేదికగా.. దుబాయ్‌లోని కొత్త టెంపుల్ వీడియోని షేర్ చేశారు. ఇందులో ఆలయం ఎంతో అందంగా కనిపిస్తోంది. వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు ఇందులో కొలువు దీరారు. "విజయదశమి సందర్భంగా దుబాయ్‌లోని ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తాను" అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ ఆలయాన్ని దసరాకు ముందు రోజు..భారత్, దుబాయ్‌కు చెందిన ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. 200 మంది ప్రముఖులు, దౌత్యవేత్తలతో సహా స్థానిక నేతలూ ఇందులో పాల్గొన్నారు. జెబల్ అలీ ప్రాంతంలో ఈ ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతంలోనే 9 పుణ్య క్షేత్రాలున్నాయి. వీటిలో 7 చర్చ్‌లుకాగా, ఓ గురుద్వారా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఆలయం వచ్చి చేరింది. దుబాయ్‌లో నిర్మించిన రెండో హిందూ ఆలయం ఇదే. 1958లో మొదటి సారి ఆలయాన్ని కట్టారు.
Also Read: PM Modi Security Breach: ప్రధాని మోడీ ర్యాలీలో భద్రతా లోపం, సెక్యూరిటీని దాటుకుని వచ్చిన యువకుడు