Gangsters Marriage: గ్యాంగ్‌స్టర్ల ప్రేమ పెళ్లికి కేంద్ర, రాష్ట్ర బలగాల నిఘా- కళ్యాణ మండపం చుట్టూ హై సెక్యూరిటీ
Gangsters Love Marriage: ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు రేపు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వారి పెళ్లిపై... కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు గట్టి నిఘా పెట్టాయి. కళ్యాణ మండలం చుట్టూ హైసెక్యూరిటీ ఉంచారు.
Gangsters Marriage tomorrow: పచ్చని తోరణాలు... బంధువుల హడావుడి, బాజా బజంత్రీలు ఉండాల్సిన పెళ్లి మండపం ప్రాంగణంలో ఎటు చూసినా... పోలీసుల బూట్ల చప్పుడు, డ్రోన్లు, సీసీ కెమెరాలు.. మెటల్ డిటెక్టర్లు.. భారీగా మోహరించిన సాయుధ బలగాలు... ఇవే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీని చూస్తే... వీవీఐపీల కోసమా అన్నట్టు అనిపిస్తోంది. కానీ.. అది నిజం కాదు... అక్కడ జరగబోతోంది ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల పెళ్లి. పెరోల్‌పై బయటకు వస్తున్న భయంకరమైన గ్యాంగ్‌సర్.. తూటాలరాణిగా పేరుపొందిన మరో గ్యాంగ్‌స్టర్... వీరిద్దరూ రేపు పెళ్లిచేసుకోబోతున్నారు. వీరి పెళ్లి.. మూడు రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది. పెళ్లి కోసం పెరోల్‌పై బయటకు వస్తున్న గ్యాంగ్‌స్టర్... కస్టడీ నుంచి తప్పించుకోకుండా... అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా... ఢిల్లీ పోలీసులు అడుగడునా డేగ కన్ను వేసి ఉంచారు.
హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జతేడీ, రాజస్థాన్‌కు చెందిన లేడీ క్రిమినల్ అనురాధా చౌదరి అలియాస్ మేడమ్ మింజ్.. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రేపు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరిద్దరూ అనేక కేసుల్లో నిందితులు. వీరిద్దరూ అండర్ వరల్డ్ క్రిమినల్సే. సందీప్ రేపు.. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో ఉన్న సంతోష్‌గార్డెన్‌లో వీరి వివాహం జరగనుంది. మేడమ్ మింజ్ బైయిల్‌పై బయట ఉండగా... సందీప్ పెరోల్‌పై బయటకు వచ్చి... పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి కోసం సందీప్‌కు ఆరు గంటలు మాత్రమే పెరోల్ ఇచ్చింది కోర్టు. ఆ ఆరు గంటల్లోనే సందీప్ జైలు నుంచి బయటకు వచ్చి... 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివాహ వేదిక దగ్గరకు చేరుకుంటాడు. అతడిని భారీ పోలీసు బందోబస్తు మధ్య తీసుకువచ్చి.. పెళ్లి తంతు పూర్తికానిచ్చి... సాయంత్రం 4 గంటల లోపు తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లిపోతారు.
గ్యాంగర్ కాలా జతేడీ తరఫు న్యాయవాది 51వేల రూపాయలు చెల్లించి పెళ్లి మండపాన్ని బుక్ చేశాడు. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించినట్టు సమాచారం. వివాహ వేదిక వద్ద అతిథుల ఎంట్రీని బార్‌కోడ్ రికార్డ్ చేస్తుంది. అతిథులు ద్వారకలోని వేదికలోకి ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్ ద్వారా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. జయమాల వేడుక కోసం వధువు, వరుడిని ఎత్తడానికి వీలుండేలా క్రేన్‌ను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద ఉన్న వెయిటర్లు, ఇతర కార్మికులందరికీ ఐడీలు కార్డులు ఇచ్చారు. అయితే, కాలా జతేడీ 2020లో ఫరీదాబాద్ కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో హర్యానా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతడి ముఠా సభ్యులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఇప్పుడు... అలాంటి ఘటనలకు తావివ్వకుండా.. గ్యాంగ్‌వార్ జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తోపాటు ప్రత్యర్థి గ్యాంగ్‌లకు చెందిన గ్యాంగ్‌స్టర్లు కూడా పెళ్లికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వివాహ వేదికను...ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు 250 మంది పోలీసులతో పాటు ఆధునిక ఆయుధాలతో కూడిన స్వాట్ కమాండోలు మోహరించబోతున్నారు. వీరిలో స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హర్యానా సీఐఏ సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బంది అత్యాధునికమైన ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగిస్తారు. ఎలాంటి దాడినైనా ఎదుర్కోంటారు. ఇక.. కల్యాణ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల్లో చాలా మంది యూనిఫాంలో ఉండరు. సాధారణ దుస్తుల్లోనే ఉంటారు. జైలు నుంచి వివాహ వేదిక వరకు గ్యాంగ్‌స్టర్ కాలా జాతేడి దగ్గర భద్రతా సిబ్బంది ఉంటారు. పెళ్లి సమయంలోనూ వారు అప్రమత్తంగా ఉంటారు.
గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ కాలా జతేడీ పోలీసుల కస్టడీ నుండి పారిపోకుండా చూడటం, అలాగే... వివాహ వేడుకలో ప్రత్యర్థి ముఠాలు దాడులు జరపకుండా ఆపడం. గ్యాంగ్‌స్టర్‌కు చాలా మంది శత్రువులు ఉన్నందున.. వివాహ సమయంలో ఎవరైనా అతనిపై దాడి చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫంక్షన్ హాల్ దగ్గర ఇప్పటికే 3 సార్లు రెక్కీ నిర్వహించారు పోలీసులు. పెళ్లి పూర్తయ్యే వరకు సమీపంలోని దుకాణాలన్నీ మూసివేయించారు.