Delhi Heat Waves: ఢిల్లీని హడలెత్తిస్తున్న వడగాలులు, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి -పెరుగుతున్న మరణాలు
Delhi Heatwave: ఢిల్లీలో వడగాలుల కారణంగా 9 రోజుల్లోనే 192 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని ఆసుపత్రుల్లోనూ వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు.
Heatwaves in Delhi: దేశ రాజధాని ఢిల్లీని వడగాలులు చుట్టుముట్టాయి. రోజూ 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి అందరి ఆరోగ్యమూ దెబ్బ తింటోంది. జూన్ 11-19వ తేదీ మధ్యలో ఢిల్లీలో వడదెబ్బ తగిలి 192 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా ఇల్లంటూ లేక ఎక్కడ పడితే అక్కడ జీవనం సాగిస్తున్న వాళ్లే. నిలువ నీడలేక అలా ఎండకు మాడి చనిపోయారు. కేవలం 48 గంటల్లోనే 50 మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అందరూ వడదెబ్బ కారణంగానే మృతి చెందారని అధికారికంగా ధ్రువీకరించలేదు. అయినా అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి వీళ్లు ఎండల వల్లే చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్న వాళ్లలో ఎక్కువ శాతం నిరాశ్రయులే ఉంటున్నారు. రోడ్ల మీద, అక్కడక్కడా తల దాచుకునే వాళ్లు ఈ ఎండలకు అల్లాడిపోతున్నారని అధికారులు వెల్లడించారు. డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
నిండిపోతున్న హాస్పిటల్స్..
అటు హాస్పిటల్స్‌లోనూ విపరీతంగా వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా మరణాల సంఖ్యా పెరుగుతోంది. సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌లో 24 గంటల వ్యవధిలోనే వడదెబ్బ కారణంగా 13 మంది చనిపోయారు. వడదెబ్బ లక్షణాలతో 33 మంది చేరినట్టు వైద్యులు వెల్లడించారు. మిగిలిన హాస్పిటల్స్‌లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండ వేడికి కొంత మంది చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరు కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలూ వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజుల పాటు వడగాలులు ఇలాగే కొనసాగితే మరి కొన్ని సమస్యలూ వస్తాయని తేల్చి చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి..
దేశవ్యాప్తంగా కూడా వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకూ 110 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. ఈ వేసవిలో కనీసం 40 వేల వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా యూపీ, బిహార్, రాజస్థాన్‌లో ఎక్కువగా కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హాస్పిటల్స్‌లో ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. ఇదే సమయంలో మార్గదర్శకాలూ జారీ చేశారు. అయితే..IMD మరి కొద్ది రోజుల్లో ఈ హీట్‌వేవ్స్ నుంచి ఊరట లభించే అవకాశముందని అంచనా వేసింది. త్వరలోనే ఢిల్లీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ ప్రజలకు ఇది కొంత వరకూ ఉపశమనం ఇవ్వనుంది. అంతే కాదు మరో రెండు రోజుల వరకూ వేడిగాలుల ప్రభావం కూడా తగ్గుముఖం పట్టే అవకాశముందని IMD వెల్లడించింది.