Donald Trump: ట్రంప్ మరణించారని ఆయన కొడుకు ఖాతా నుంచే ట్వీట్
Donald Trump: ట్రంప్ మరణించాడని ఆయన కొడుకు ఖాతా నుంచే ట్వీట్ చేశారు హ్యాకర్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ మరణించాడంటూ ట్విట్టర్‌లో పోస్ట్ ప్రత్యక్షమైంది. అది కూడా ట్రంప్ కుమారుడి ఖాతా నుంచి. దీంతో కొద్ది సేపు అంతా గందరగోళానికి గురయ్యారు. జూనియర్ ట్రంప్ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో 'నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ ఇక లేరని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను' అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. అయితే కొద్ది సేపటిలోనే ఇదంతా ఫేక్ న్యూస్ అని, జూనియర్ ట్రంప్ ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురయ్యిందని వెల్లడించారు. అయితే ఎవరు హ్యాక్ చేశారనే విషయం గురించి వివరాలు వెల్లడించలేదు.
డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై వెంటనే స్పందించారు. తాను మరణించానని సోషల్ మీడియాలో వార్తలు రావడం ఫేక్ అని, తాను బతికే ఉన్నానని తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ట్రంప్ ఖాతాకు దాదాపు పది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. గంటలోపే ఆయన ఖాతాలో పోస్ట్ అయిన ఫేక్ న్యూస్‌లను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిలీట్ చేసింది. జూనియర్ ట్రంప్ ఖాతా హ్యాక్ అయ్యిందని స్పష్టంచేసింది. హ్యాక్ అయిన ఖాతాలో ఇంకా పలు పోస్ట్‌లు కూడా చేశారు. ఉత్తరకొరియా ఓడిపోతుందని, జెఫ్రీ ఎప్‌స్టీన్ గురించి, క్రిప్టో కరెన్సీ ఇన్‌ఫ్లూయెన్సర్ రిచర్డ్ హార్ట్ గురించిన ట్వీట్లు కూడా చేశారు.
ట్రంప్ జూనియర్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందని ఆయన ప్రతినిధి ఆండ్రూ సురబియన్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో పోస్ట్ అయిన న్యూస్ ఏ మాత్రం నిజం కాదని స్పష్టంచేశారు. ఈ విషయంపై ఎక్స్ ను సంప్రదించగా.. ఇప్పుడు బిజీగా ఉన్నాం, దయచేసి తర్వాత చెక్ చేయండి అంటూ ఆటోమెటిక్ రిప్లై వచ్చినట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను 2021లో సస్పెండ్ చేశారు. హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందనే ఆరోపణలతో ఆయన ఖాతాను సస్పెండ్ చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరించారు. అయితే తన ట్విట్టర్ ఖాతాను తొలగించడంతో డొనాల్డ్ ట్రంప్ సొంతగా ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్థాపించి దానిని ఉపయోగిస్తున్నారు. ట్రంప్ జూనియర్ మాత్రం ట్విట్టర్ ఖాతానే వాడుతున్నారు. 2022 అక్టోబరులో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే.