Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!
Gujarat Election Results 2022: ఈ నెల 10న లేదా 11న గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
Gujarat Election Results 2022:
10న లేదా 11న ప్రమాణ స్వీకారం..
గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం సాధించనుందని కౌంటింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 152 చోట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది కాషాయ పార్టీ. ఇప్పటికే బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సాయంత్రానికి ఫలితాలు ముగిసే నాటికి బీజేపీ కనీసం 150 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే..బీజేపీ తన రికార్డుని తానే బద్దలు కొట్టి...భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్టే. 27 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌లో అధికారంలో ఉన్నా..ఈ స్థాయిలో సీట్లు దక్కలేదు. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తూ వచ్చేది. కానీ..ఈ సారి కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడటం వల్ల బీజేపీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తరువాయి. అయితే...ఇందుకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10న లేదా 11న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధాని మోదీ కార్యాలయంలో దీనిపై మేథోమధనం కొనసాగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరగనుంది. వరుసగా ఏడో సారి గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించనుంది బీజేపీ. కౌంటింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వస్తోందన్న విషయం అర్థమైంది. 54% ఓటు షేర్‌తో 154 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతోంది బీజేపీ. 2002 ఎన్నికల్లో కాషాయ పార్టీకి 127 సీట్లు దక్కాయి. అప్పటి నుంచి బీజేపీకి అంతకు మించి ఎక్కువ స్థానాలు రాలేదు. అంటే దాదాపుగా 20 ఏళ్లుగా 130 లోపు సీట్లకే పరిమితమవుతూ వచ్చింది. ఈ సారి మాత్రం...ఆ ట్రెండ్‌కి స్వస్తి పలికింది.
మోడీ చరిష్మా..
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 30 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ...దాన్ని కూడా అధిగమించి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మోడీ, షా ద్వయం ఈ సారి కూడా మేజిక్ చేశారని బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గతంలో వెస్ట్ బెంగాల్‌లో వామపక్షాలు వరుసగా ఏడు సార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడదే రికార్డుని గుజరాత్‌లో రిపీట్ చేసింది బీజేపీ. ద్రవ్యోల్బణం, నీటి కొరత, జాతీయవాదంతో పాటు గుజరాతీ ఐడెంటిటీ అంశాలు...ఈసారి ఎన్నికలను ప్రభావితం చేశాయి. భాజపాను ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి.
ఆమ్ఆద్మీ పార్టీ నమ్ముకున్న అస్త్రం ద్రవ్యోల్బణం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భాజపాను చుట్టుముట్టాలని చూశారు కేజ్రీవాల్. అటు కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని నమ్ముకుంది. అయితే...ఈ ప్రచారాన్ని భాజపా కొట్టి పారేసింది. పైగా..ఉజ్వల స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారులందరికీ ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో "ద్రవ్యోల్బణం" అంశం మరుగున పడుతుందని బీజేపీ భావించింది. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే...ద్రవ్యోల్బణం అనే అంశం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపించలేదని అర్థమవుతోంది.
Also Read: Gujarat Election Results 2022: మోర్బి నియోజకవర్గంలోనూ బీజేపీదే ఆధిక్యం, ప్రభావం చూపని వంతెన ప్రమాదం