Gujarat Election 2022: మీరు చెప్పండి మేం వింటాం, గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కొత్త స్ట్రాటెజీ
Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలే నిర్ణయించాలని బీజేపీ కోరింది.
Gujarat Election 2022:
ప్రజలకే అవకాశం..
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించిన బీజేపీ...ఇప్పుడు గుజరాత్‌పై దృష్టి సారించింది. ఈ మేరకు "అగ్రేసర్ గుజరాత్" (Agresar Gujarat) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలో సూచించాలని ప్రజలను కోరింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీ ఆర్ పాటిల్ ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ నెల 15 వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. గాంధీనగర్‌లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వేదికగా ఈ క్యాంపెయిన్ వివరాలు వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టోపై సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గురించి ప్రస్తావించిన సీఆర్ పాటిల్...ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "సుదీర్ఘ కాలంగా నిర్లక్ష్యానికి గురైన హామీలు నెరవేర్చాం. బీజేపీ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేదే లేదు. ఈ ఎన్నికల్లో మేము రికార్డు స్థాయిలో విజయం సాధిస్తాం. అంతకు ముందే ప్రజల సూచనలు, సలహాలు తీసుకోవాలనుకుంటున్నాం" అని వెల్లడించారు. 2017లో బీజేపీ ఇచ్చిన హామీల్లో 78% మేర నెరవేర్చినట్టు స్పష్టం చేశారు. 75 ఏళ్లకు పైబడిన అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగరని తెలిపారు. అంతే కాదు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీల కుటుంబ సభ్యులకూ టికెట్ ఇవ్వడం లేదని చెప్పారు. అన్ని పబ్లిక్ ప్లేసెస్‌లో సజెషన్ బాక్స్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలెవరైనా ఓ పేపర్‌పై సూచనలు రాసి అందులో వేయొచ్చని అన్నారు. http://www.agresargujarat.com లోనూ సలహాలు ఇవ్వొచ్చని తెలిపారు. 7878182182 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి అయినా ఈ సలహాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో..
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం మొత్తం 11 కీలకమైన హామీలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. సంకల్ప్ యాత్రలో భాగంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది కాషాయ పార్టీ. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. 11 హామీలు నెరవేర్చేందుకు భాజపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
1. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే Uniform Civil Code అమల్లోకి తీసుకొస్తామని భాజపా వెల్లడించింది. ఇప్పటికే దీనిపై కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
2. ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధి కింద రైతులకు అదనంగా రూ.3 వేల ఆర్థిక సాయం
3. 8 లక్షల ఉద్యోగాల కల్పన
4. పీఎం గ్రామీణ్ రోడ్‌లో భాగంగా అన్ని గ్రామాలకూ రోడ్ల నిర్మాణం, ఇందుకోసం రూ.5 లక్షల కోట్లు కేటాయింపు
5. శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్ల కేటాయింపు
6. యాపిల్ ప్యాకేజింగ్‌పై జీఎస్‌టీని తగ్గించడం.
7. ఐదు కొత్త మెడికల్ కాలేజ్‌ల నిర్మాణం.
8. రూ.9 వేల కోట్ల వ్యయంతో స్టార్టప్ స్కీమ్ అమలు, యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
9. ప్రతి నియోజకవర్గంలో మొబైల్ క్లినిక్ వ్యాన్స్‌ల సంఖ్యను పెంచటం
10. అమర వీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంపు
11. వక్ఫ్ ఆస్తులపై విచారణ జరపటం
Also Read: J&K Statehood Restoration: జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా? సంకేతాలిచ్చిన నిర్మలా సీతారామన్