Greater Noida Crime: మాకు నీ కుక్క కావాలి, అది ఇస్తే కానీ వదిలేది లేదు - కిడ్నాపర్ల వింత డిమాండ్
Greater Noida Crime: గ్రేటర్ నోయిడాలో కుక్క కోసం ఓనర్‌ను కిడ్నాప్ చేశారు ముగ్గురు దుండగులు.
Greater Noida Crime:
గ్రేటర్ నోయిడాలో కిడ్నాప్..
గ్రేటర్ నోయిడాలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు వింత కండీషన్ పెట్టారు. "నువ్వు పెంచుకుంటున్న కుక్కను మాకు అప్పగిస్తేనే వదిలేస్తాం" అని బెదిరించారు. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియోలో వచ్చిన కిడ్నాపర్లు కుక్క యజమానిని బలవంతంగా అందులోకి ఎక్కించారు. అలీగర్ వరకూ తీసుకెళ్లారు. కిడ్నాప్ అయిన వ్యక్తి పేరు శుభం అని తెలిసింది. అతని సోదరుడు రాహుల్...ఇందుకు సంబంధించిన మరికొన్ని వివరాలు చెప్పాడు. "నా అన్నయ్య Dogo Argentino జాతి కుక్క ఉంది. ఆ కుక్కతో కలిసి వాకింగ్ వెళ్లాడు.
ఉన్నట్టుండి ముగ్గురు కిడ్నాపర్లు స్కార్పియోలో వచ్చారు. ఆ కుక్కను ఇచ్చేయాలని బెదిరించారు. అందుకు నా అన్నయ్య ఒప్పుకోలేదు. ఈ లోగా నేను అక్కడికి వెళ్లాను. ఉన్నట్టుండి వాళ్లు గన్స్ తీశారు. గట్టిగా బెదిరించి శుభంను కిడ్నాప్ చేశారు. కాల్ చేసి కుక్కను ఇస్తే కానీ మీ అన్నను విడుదల చేయం అని చెప్పారు" అని వివరించాడు. అయితే కిడ్నాపర్ల డిమాండ్‌కు అతడు ఒప్పుకోలేదు. అర్ధరాత్రి నడిరోడ్డుపైన
అడ్డగించి మరోసారి బెదిరించారు కిడ్నాపర్లు. ఆ తరవాత బాధితుడు సోదరుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. విశాల్, లలిత్, మోంటీ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. విచారణ మొదలు పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం వాళ్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
యజమానికి పరిహారం..
ఈ మధ్య కుక్కలు.. మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కానీ తాజాగా పెంపుడు కుక్క కరిచిన కేసులో ఓ మహిళా బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మున్ని అనే మహిళ.. ఓ ఇంటి పనికి వెళ్తున్న సమయంలో స్థానికంగా ఉండే వినీత్ చికారా అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఆమెను కరిచింది. గురుగ్రామ్‌లో ఆగస్టు నెలలో ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. గురుగ్రామ్‌లో ఉన్న సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ ఘటనపై గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జిల్లా వినియోగదారుల ఫోరమ్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కావాలంటే ఆ డబ్బును కుక్క ఓనర్ నుంచి రికవరీ చేయవచ్చు అని వినియోగదారుల ఫోరమ్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎఫ్ఐఆర్‌లో కుక్క బ్రీడ్‌ను పిట్‌బుల్‌గా చేర్చారు. కానీ ఆ తర్వాత ఓనర్ ఆ బ్రీడ్‌ను డాగో అర్జెంటినోగా పేర్కొన్నారు. అయితే ఆ శునకాన్ని కస్టడీలోకి తీసుకోవాలని, డాగ్ ఓనర్ లైసెన్సును కూడా రద్దు చేయాలని ఫోరమ్ ఆదేశించింది. డాగో అర్జెంటీనో జాతి కుక్కపై నిషేధం ఉంది. దానితో పాటు మొత్తం 11 రకాల బ్రీడ్లు పెంపుడు కుక్కల జాబితాలో లేవు.
Also Read: Arunachal CM On Tawang Clash: 'ఇది 1962లోని నెహ్రూ పాలన కాదు- ఇప్పుడు మోదీ యుగం'