Vinayaka Vivadam : వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం ! ప్రభుత్వం చెప్పిందేంటి ? విపక్షాల విమర్శలేంటి..?
వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు రాజకీయరంగు పులుముకుంటున్నాయి. ఏ వేడుకలకు రాని కరోనా వినాయకచవితికి మాత్రమే వస్తుందా అని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ఆందోళనలు ప్రారంభించగా... చంద్రబాబు కూడా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి పండుగపై ఆంక్షలు విధించడం దుమారం రేపుతోంది. ఏ కార్యక్రమానికీ లేని ఆంక్షలు హిందువుల పండుగలకే పెడుతున్నారని బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపున వైసీపీ నేతలు చెబుతున్నారు. నిజంగానే ఏపీ ప్రభుత్వం హిందువుల పండుగలపై ఆంక్షలు పెడుతోందా..? బీజేపీ రాజకీయమే చేస్తోందా..?. వినాయకచవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించిందా..?
Also Read : హిందువుల పండుగలకే కరోనా వస్తుందా..?
వినాయకచవితిపై ఇవీ ప్రభుత్వ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటలవరూ కర్ఫ్యూ పొడిగిస్తూ మూడు రోజుల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కోవిడ్ పరిస్థితులపై జరిగిన సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్ఫ్యూ పొడిగింపుతో పాటు వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని.. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే నిమజ్జన ఊరేగింపులు వద్దని జారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని ప్రభుత్వం పేర్కొంది. వైద్యాధికారులు ఈ మేరకు సిఫార్సులు చేసినందున ఆమోదిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడంతో అలా పోలీసులు రంగంలోకి దిగారు. విగ్రహాల తయారీ దారులను అదుపులోకి తీసుకోవడం.. మండపాలు పెట్టాలనుకున్నవారికి హెచ్చరికలు చేయడం వంటివి చేయడం వివాదమయింది.
Also Read : ఏపీ కాంట్రాక్టర్లకు బిల్లల భయమా..? బెదిరింపుల గండమా..?
ప్రభుత్వ ఆంక్షలపై విపక్షాల అభ్యంతరం..!
వినాయకచవితి పండుగను అందరూ ఇళ్లలో చేసుకుంటారు. అలాగే వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితి. గత రెండేళ్లుగా కరోనా లాక్ డౌన్ కారణంగా వినాయక చవితి పండుగ ఇళ్లలోనే చేసుకున్నారు. ఈ సారి కాస్త పరిస్థితులు బాగుండటంతో మండపాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం అనూహ్యంగా ఆంక్షలు విధించడంతో హిందూ సంస్థలతో పాటు ఇతర పార్టీలు కూడా తీవ్ర విమర్శలు ప్రారంభించాయి. ప్రభుత్వం తరపున చేపడుతున్న ఏ కార్యక్రమం అయినా అలాగే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేపట్టే కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున జనాలు గుమికూడుతుంటారు. ఎప్పుడూ ఎవరూ ఆంక్షలు పెట్టరు. ఇవన్నీ గుర్తు చేస్తూనే విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క హిందువుల పండుగలకే కరోనా వస్తుందా అని ప్రశ్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదేం ద్వంద్వ ప్రమాణాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read : అప్పుల కోసం మరో సలహాదారును పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం
బీజేపీ ఆందోళనలు - మత రాజకీయమన్న ప్రభుత్వం..!
ఇక హిందూత్వ రాజకీయాలంటే తమకు పేటెంట్ ఉన్నట్లుగా భావించే భారతీయ జనతా పార్టీ నేతలు ఉద్యమం ప్రారంభించారు. వినాయక చవితి పండుగ చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి ఏమిటని ప్రశ్నిస్తూ కలెక్టరేట్ల మట్టడి వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్నూలులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు ఇతర నేతలు వినాయకచవితిపై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లిశ్రీనివాస్ హెచ్చరించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వినాయక మండపాలు వద్దని చెప్పామని ఇళ్లలో పండుగ చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. నిబంధనలపై కేంద్ర ప్రభుత్వాన్నే అడగాలని మరో వైసీపీ నేత మల్లాది విష్ణు బీజేపీ నేతలకు సూచించారు.
తీవ్రంగా నష్టపోతున్న విగ్రహాల తయారీదారులు..!
వినాయక చవితి కోసం విగ్రహాల వ్యాపారాలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతూంటారు. వారు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లక్షలు నష్టపోయారు. వారు కూడా ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని కోరుతున్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లోనూ వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణల్లో మండపాలకు అనుమతులు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాలని అక్కడి ప్రభుత్వాలు షరతులు పెట్టాయి. ఇక్కడ కూడా అలా పెడితే సమస్య ఉండేది కాదు. కానీ ఇతర వర్గాల వేడుకలను యధావిధిగా చేసి... ప్రభుత్వం, పార్టీ తరపు కార్యక్రమాలను కూడా కరోనా రాదన్నట్లుగా నిర్వహించి ఒక్క వినాయక చవితి విషయంలోనే ఆంక్షలు పెట్టడం సాధారణ ప్రజల్లోనూ వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఈ అంశంపై రాజకీయం కూడా అవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
Also Read : బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలు ఎక్కడ ?