Goa Political News: భాజపా చేసిన ఆ ప్లాన్‌తో కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాక్, అక్కడ ఇక ప్రతిపక్షమే ఉండదు!
Goa Political News: గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఫలితంగా అక్కడ ఆపోజిషన్ అంటూ లేకుండా పోయింది.
Goa Political News:
కాంగ్రెస్ నుంచి భాజపాకు వలసలు..
గోవాలో అధికార భాజపాకు ప్రతిపక్షమే లేకుండా పోతుందా..? ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే అదే నిజమని పిస్తోంది. ఇటీవలే 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఫలితంగా...కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోనుంది. గోవాలో కాంగ్రెస్ ఇక కనుమరుగు కానుందని కొందరు అంటుంటే...అసలు భాజపాకు కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి. గోవాలో భాజపాకు మ్యాజిక్ నంబర్‌కు మించి సీట్లున్నాయి. అంటే...అక్కడ పార్టీ బలంగానే ఉంది. సీఎం ప్రమోద్ సావంత్ కుర్చీకి వచ్చిన ఢోకా కూడా ఏమీ లేదు. కానీ...భాజపాలోని అంతర్గత వ్యూహాల కారణంగా...చివరకు కాంగ్రెస్ బలి కావాల్సి వచ్చింది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో భాజపా 20 సీట్లు గెలుచుకుంది. ఎమ్‌జీపీ, స్వతంత్య్ర అభ్యర్థులతో కలిసి ప్రమోద్ సావంత్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మొత్త 25 మంది ఎమ్మెల్యేలతో భాజపా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అటు కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా 11 స్థానాలు సాధించుకుంది. ఇప్పుడు వీరిలో 8 మంది భాజపా కండువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్‌కు మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ చేరికలకు కారణం...సీఎం ప్రమోద్ సావంత్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్తపడి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారని అంటున్నారు.
సీఎం సావంత్ ప్లానింగా..?
ఇక్కడ మరో కీలకమైన అంశమూ చెప్పుకోవాలి. ప్రస్తుతం సావంత్ కేబినెట్‌లో విశ్వజిత్ రాణే మంత్రిగా ఉన్నారు. సీఎంకి, ఈ మినిస్టర్‌కి రాజకీయ విభేదాలున్నాయి. 2017లో కాంగ్రెస్‌ను వీడిన రాణే, తరవాత భాజపాలో చేరారు. మనోహర్ పారికర్ సీఎంగా ఉన్నప్పుడే కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. మనోహర్ పారికర్ మృతి చెందాక, భాజపా సావంత్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. గోవా రాజకీయాల్లో కీలకమై నేత ఎవరు అంటే అందరూ విశ్వజిత్ రాణే పేరు చెబుతారు. అంత ఫేమస్ ఆయన. గతంలో ఆరోగ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య దేవియా రాణే కూడా పోరియం నియోజకవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేసి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ రాణే కుమారుడిగా విశ్వజిత్ రాణేకు మంచి పేరే ఉంది. అయితే..సీఎం సావంత్‌తో మాత్రం భేదాభిప్రాయాలున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తరవాత విశ్వజిత్ రాణే, ఆయన సతీమణి గోవాలోని అన్ని ప్రముఖ న్యూస్‌పేపర్లలో పెద్దపెద్ద ఫోటోలతో ఆర్టికల్స్ వేయించారు. గెలిపించిన ఓటర్లకు థాంక్యూ చెప్పారు. ఈ ప్రకనటల్లో భాజపా బడా నేతలందరి ఫోటోలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, దేవేంద్ర ఫడణవీస్ ఫోటోలు ప్రింట్ చేయించిన విశ్వజిత్ రాణే...సావంత్ ఫోటోను మాత్రం వదిలేశారు. ఓ సందర్భంలో దేవియా రాణే...విశ్వజిత్ రాణే రాజకీయ అనుభవంపై మాట్లాడారు. ఆయన సీఎం పదవికి కూడా అర్హుడని తేల్చి చెప్పారు. దాదాపు 15 ఏళ్లుగా గోవా ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారామె. అయితే...సీఎం పదవి ఇవ్వాలా లేదా అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని వెల్లడించారు. భాజపా ఎమ్మెల్యేలందరితోనూ విశ్వజిత్ రాణేకు మంచి సాన్నిహిత్యమే ఉంది. భవిష్యత్‌లో ఎదురు తిరిగి తన కుర్చీకి ఎసరు పెడతాడేమో అన్న భయంతో ప్రమోద్ సావంత్ ముందుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే తన వద్ద కూడా ఎమ్మెల్యేల బలం ఉండాలని సావంత్ ఇలా చేశారని తెలుస్తోంది. వచ్చే వారం గోవా కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.
Also Read: Queen Elizabeth II Funeral: భర్త సమాధి పక్కనే క్వీన్ ఎలిజబెత్ సమాధి కూడా, అంత్యక్రియలకు అంతా సిద్ధం