Russia: రష్యాలోని నదిలో నలుగురు భారతీయ విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతి - మిగతా వారి కోసం గాలింపు
Russia News: రష్యాలో ఓ నదిలో నలుగురు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యారు.
Indian Students Drown in River: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు భారతీయ విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని గుర్తించగా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ యువతి నదిలో ప్రమాదవశాత్తు పడిపోగా వెంటనే రక్షించారు. రష్యాలోని ఇండియన్ ఎంబసీ స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా మిగతా ముగ్గురి మృతదేహాల్ని వెలికి తీయాలని కోరింది. ఆ డెడ్‌బాడీస్‌ని గుర్తించి బంధువులకు అందించేందుకు అన్ని విధాలుగా శ్రమిస్తున్నామని రష్యా అధికారులు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడ్డ యువతికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. Veliky Novgorod State University లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఇలా ప్రమాదానికి గురయ్యారు. అయితే...ఈ ప్రమాదం ఎలా జరిగిందో ప్రస్తుతానికి తమ వద్ద సమాచారం లేదని స్థానిక అధికారులు వివరించారు.
వైద్య విద్యలో ఎప్పుడూ అగ్రస్థానంలో రష్యాకి చాల మంది విద్యార్థులు క్యూ కడుతుంటారు. భారతీయ విద్యార్థులూ మెడికల్ డిగ్రీల కోసం రష్యాకి వెళ్తుంటారు. మిగతా దేశాలతో పోల్చి చూస్తే రష్యాలో వైద్య విద్యకు అయ్యే ఖర్చు తక్కువ. అయితే...విద్యా నాణ్యతలో మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలనే అనుసరిస్తోంది రష్యా. అందుకే అంతగా అక్కడికి వలసలు పెరుగుతున్నాయి.