Prajwal Revanna convicted in rape case: ప్రజ్వల్ రేవణ్ణ రేపిస్టే- తేల్చిన కోర్టు - శనివారమే శిక్ష ఖరారు !
Revanna convicted in rape case: జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా కోర్టు తేల్చింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నారు.

Former Karnataka MP Prajwal Revanna convicted in rape case: కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ణయించింది. హాసన్ జిల్లాలోని గన్నికడ ఫామ్‌హౌస్‌లో పనిచేసిన 48 ఏళ్ల మహిళపై 2021లో రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు అయింది. ప్రత్యేక కోర్టు లో జరిగిన విచారణలో ఆధారాలు సరిపోలడంతో దోషిగా తేల్చారు. శనివారం శిక్షను ఖరారు చేయనున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం మూడు అత్యాచారం కేసులు, ఒక లైంగిక వేధింపు కేసు నమోదయ్యాయి. ఈ కేసులు 2024 ఏప్రిల్‌లో హాసన్‌లో లీకైన 2,900కు పైగా వీడియోలు , ఫోటోల తర్వాత నమోదయ్యాయి. 48 ఏళ్ల పని మనిషిపై ప్రజ్వల్ రేవణ్ణ రెండుసార్లు అత్యాచారం చేసి మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వీడియోలు లీక్ అయిన తర్వాత పని మనిషి తనపై జరిగిన అత్యాచారం గురించి వివరాలు చెప్పింది. ఆమె కుమార్తెను వీడియో కాల్స్ ద్వారా లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2024 ఆగస్టు 23న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణ కొనసాగుతోంది.
హసన్ నియోజకవర్గంలోని జిల్లా పంచాయతీ సభ్యురాలిపై మూడు సంవత్సరాల పాటు పదేపదే లైంగిక దాడులు చేసినట్లు మరో కేసు నమోదు అయింది. ప్రజ్వల్ అత్యాచార ఘటనలను వీడియోలో రికార్డ్ చేసి, బాధితురాలిని బెదిరించడానికి , బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 13న SIT ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. విచారణ కొనసాగుతోంది.
ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ కోసం బెంగళూరు ప్రత్యేక కోర్టు, కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అన్ని పిటిషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి. సుప్రీంకోర్టు 2024 నవంబర్ 11న బెయిల్‌ను తిరస్కరిస్తూ, ప్రజ్వల్ "శక్తివంతమైన, ప్రభావవంతమైన" వ్యక్తి అని, అతను విచారణను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసులను విచారిస్తోంది. SIT మూడు చార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది, వీటిలో ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా వీడియోలు అసలైనవని నిర్ధారించారు.
A Special Court in Bengaluru today convicted Janata Dal (Secular) leader and former MP Prajwal Revanna in the first rape case registered against him at the Holenarasipura Rural Police Station of Hassan District.
— Live Law (@LiveLawIndia) August 1, 2025
Read more: https://t.co/V5D0sVREmI#PrajwalRevanna pic.twitter.com/UZAn5Grwfz
2024 ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల సమయంలో వీడియోలు లీక్ అయిన తర్వాత ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. 2024 మే 31న భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే అతన్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైలులో ఉన్నాడు ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవేగౌడ మనవడు . హోలెనరసిపుర జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్.డి. రేవణ్ణ కుమారుడు. ఈ కేసుల తర్వాత జేడీ(ఎస్) అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మొదటి కేసులో దోషి నిర్ధారణ అయినప్పటికీ, మిగిలిన రెండు అత్యాచారం కేసులు మరియు లైంగిక వేధింపు కేసు విచారణలో ఉన్నాయి.





















