KCR Will Discharge: ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్న మాజీ సీఎం కేసీఆర్
Telangana Former CM KCR: కేసీఆర్ తన గాయం నుంచి కోలుకుంటుండగా.. పూర్తిగా రెస్ట్ తీసుకోవటానికి పరిమితం కావొద్దని వైద్యులు హెచ్చరించారు.
బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం (Former CM )కేసీఆర్ ( KCR ) క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడ(Somajiguda)లోని యశోద ఆసుపత్రిలో హిప్ బోన్ రిప్లేస్‌మెంట్ సర్జరీని చేయించుకున్న కేసీఆర్... వేగంగా రికవరీ అవుతున్నారు. ఆయన గాయం నుంచి కోలుకుంటుండటంతో... శుక్రవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు యశోద ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. డిశ్చార్జ్ తర్వాత కేసీఆర్‌ను బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్‌కు ఏ కొంచెం సమయం దొరికినా ఎర్రవెల్లిలోని తన ఫౌమ్ హౌస్‌లోనే గడిపేందుకు.. ఇష్టపడుతుంటారు. అదే ఫౌమ్ హౌస్‌లో జారిపడటంతో ఆయన కాలికి తీవ్రగాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో.... నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
కేసీఆర్ తన గాయం నుంచి కోలుకుంటుండగా.. పూర్తిగా రెస్ట్ తీసుకోవటానికి పరిమితం కావొద్దని వైద్యులు హెచ్చరించారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని చెప్తూనే ఉన్నారు. సాధారణంగానే.. చదవటం అంటే కేసీఆర్‌కు ఇష్టం. దీంతో ఇప్పడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారు. చాలా మంది పరామర్శించేందుకు వస్తున్నారు. వారిని కలిసిన తర్వాత మిగతా సమయం పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే వాకర్ సాయంతో కేసీఆర్‌ను నడిపించారు డాక్టర్లు. కేసీఆర్‌కు ఆపరేషన్ నొప్పి తగ్గిందని, ప్రస్తుతం ఆయనకు సాధారణ నొప్పి మాత్రమే ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారన్నారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుంది.
యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు. సీతక్క, షబ్బీర్ అలీతో కలిసి ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు. కేసీఆర్ 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.