Pakistan FATF Grey List: ఇన్నాళ్లకు తీరనున్న పాకిస్థాన్ కష్టాలు, ఆ లిస్ట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం
Pakistan FATF Grey List: పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తొలగిస్తూ FATF కీలక నిర్ణయం తీసుకుంది.
Pakistan FATF Grey List:
గ్రే లిస్ట్ నుంచి తొలగింపు..
ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ...దాదాపు నాలుగేళ్లుగా Financial Action Task Force (FATF) గ్రే లిస్ట్‌కి పరిమితమైంది పాకిస్థాన్. అప్పటి నుంచి ఆ దేశానికి కష్టాలు మొదలయ్యాయి. తమపై కక్ష కట్టి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని పాకిస్థాన్ ఎన్నో సార్లు అసహనం వ్యక్తం చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్న దేశానికి IMF రుణం అందించదు. ఆర్థికంగా ఏ దేశమూ సహకారం అందించేందుకు
ముందుకు రాదు. ఫలితంగా...నాలుగేళ్లుగా ఆర్థికంగానూ దెబ్బ తింది దాయాది దేశం. ఇన్నాళ్లకు కాస్త ఊరట లభించింది. పారిస్‌లో జరిగిన FATF సమావేశంలో పాకిస్థాన్‌ను Gray List నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇది పెద్ద రిలీఫ్ ఇవ్వనుంది. కానీ...ఈ నాలుగేళ్ల కాలంలో ఆ దేశం చాలానే కోల్పోయింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక నష్టాల్ని చవి చూసింది. అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్న దేశం ఆ స్థాయిలో నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. 2018లో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చారు. ఆసియా పసిఫిక్ గ్రూప్‌తో కలిసి పని చేస్తూ...మనీ లాండరింగ్‌ను అరికట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందించడంపై నిఘా ఉంచడం లాంటి చర్యలతో ఈ గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను తొలగిస్తున్నట్టు FATF వెల్లడించింది. ఈ వార్త తెలిశాక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif) ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. "ఇన్నేళ్లుగా పాకిస్థాన్ పడ్డ కష్టం వృథా కాలేదు. ఈ విజయానికి కారణమైన సివిల్, మిలిటరీ లీడర్షిప్కు అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.
Pakistan 🇵🇰 exiting the FATF grey list is a vindication of our determined and sustained efforts over the years. I would like to congratulate our civil & military leadership as well as all institutions whose hard work led to today's success. Aap sab ko bohat bohat Mubarak :)
— Shehbaz Sharif (@CMShehbaz) October 21, 2022
ఎంత నష్టం జరిగిందంటే..
1. గ్రే లిస్ట్‌లో ఉండటం వల్ల పాకిస్థాన్ ఏటా 10 బిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది.
2. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఈ నష్టం విలువ రూ.75 వేల కోట్లు.
3. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పాకిస్థాన్ మొత్తంగా రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది.
ఎందుకు గ్రే లిస్ట్‌లో ఉంచారు..?
ఉగ్రవాదంపై ప్రత్యేక నిఘా ఉంచటం FATF విధి. వాళ్లకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో పసిగడుతుంది ఈ సంస్థ. 2018లో పాకిస్థాన్ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తు నిధులు అందించిందన్న కారణంతో గ్రే లిస్ట్‌లో చేర్చింది. ఈ కారణంగా...పాకిస్థాన్‌కు ఎవరూ రుణాలు అందించ లేదు. IMF,ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్,ఐరోపా సమాఖ్య సంస్థలు పాకిస్థాన్‌కు లోన్ ఇవ్వలేదు. ఇప్పుడు గ్రే లిస్ట్‌లో నుంచి తొలగించటం వల్ల ఆ సంస్థల నుంచి ఆర్థిక సహకారం పొందనుంది పాక్.