Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్ అడ్డం తిరిగిందా?
Elon Musk: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ భారత్ పర్యటనను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించాడు.
Elon Musk India Visit: భారత్‌లో టెస్లా మార్కెట్‌ని స్టార్ట్ చేయాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్న ఎలన్ మస్క్‌కి వరుస పెట్టి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ వచ్చే వారం భారత్‌కి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉంది. అప్పుడే టెస్లా ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను నామ మాత్రంగా అయినా మొదలు పెట్టాలని భావించాడు. కానీ...ఇప్పుడు ఈ పర్యటనను వాయిదా వేసుకున్నాడు. రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా ఉన్నట్టుండి ఈ షెడ్యూల్‌ని రద్దు చేసుకున్నాడు మస్క్. టెస్లాకి సంబంధించి చాలా పనులు చక్కబెట్టాల్సి ఉందని,ఆ కారణంగానే ప్రస్తుతానికి భారత్‌కి రాలేకపోతున్నానని వెల్లడించాడు. కనీసం వచ్చే ఏడాదైనా భారత్‌కి వచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. X వేదికగా ఈ విషయం చెప్పాడు.
"అనుకోకుండా టెస్లాకి సంబంధించిన పనులు పెరిగిపోయాయి. వాటిని చక్కబెట్టుకోవాల్సి ఉంది. అందుకే ప్రస్తుతానికి భారత్‌కి రాలేకపోతున్నాను. ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నాను. త్వరలోనే కచ్చితంగా భారత్‌కి వస్తాను"
- ఎలన్ మస్క్, టెస్లా సీఈవో
Unfortunately, very heavy Tesla obligations require that the visit to India be delayed, but I do very much look forward to visiting later this year.
— Elon Musk (@elonmusk) April 20, 2024
గత వారం మస్క్ కీలక ట్వీట్ చేశాడు. త్వరలోనే భారత్‌కి రానున్నానని, ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని చెప్పాడు. ఈ నెల 21న ఆయన రావాల్సి ఉంది. గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో మస్క్‌ని కలిశారు. మోదీ అభిమానిని అంటూ మస్క్ ఆయనపై పొగడ్తలు గుప్పించారు. వీలైనంత త్వరలో భారత్ మార్కెట్‌లోకి టెస్లా వస్తుందని చెప్పారు.