Jaishankar on US Immigration : ఆ భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మేం సిద్ధం - విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Jaishankar on US Immigration : అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయ వలసదారులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ అన్నారు.

Jaishankar on US Immigration : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయ వలసదారులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇటీవలే అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రతినిధిగా జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
వారిని చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించేందుకు మేం సిద్ధం
సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటోన్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటోన్న వార్తలపై స్పందించిన జైశంకర్.. అమెరికాకు వెళ్లే భారతీయుల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎంత మంది వెళ్తున్నారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేమన్నారు. "భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలకు ప్రపంచ స్థాయిలో ఎక్కువ అవకాశాలు రావాలని మేం ఆశిస్తున్నాం. అందుకే చట్టబద్దమైన, న్యాయపరంగా వెళ్లే వలసదారులకు మేం పూర్తి సహకారం అందిస్తాం" అని జైశంకర్ చెప్పారు. అక్రమ రవాణా, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న ఆయన.. ఆ తరహా పరిస్థితులు సరికావని, అది దేశానికి మంచి పేరు తీసుకురాదన్నారు. అందుకే భారతీయులెవరైనా అమెరికానే కాదు, మరే దేశానికైనా అక్రమంగా వెళ్లినట్టు గుర్తిస్తే.. వారిని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించేందుకు మేం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని స్పష్టం చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలతో అక్రమ వలసలను ముడిపెట్టవచ్చని ఆయన అన్నారు. మరో పక్క యూఎస్‌లోని 18,000 మంది భారతీయులను డాక్యుమెంట్లు లేని లేదా వారి వీసాల కాల పరిమితి దాటిన వారిని బహిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి.
#WATCH | Washington DC, USA | India's EAM Dr S Jaishankar, US Secretary of State Marco Rubio, Japan's Minister of Foreign Affairs Takeshi Iwaya, and Australian Foreign Minister Penny Wong arrive for the Quad Foreign Ministers Meeting at the Department of State. pic.twitter.com/DbAXauyv4K
— ANI (@ANI) January 21, 2025
వీసాల జారీలో ఆలస్యంపై జైశంకర్ ఆందోళన
భారతీయులకు అమెరికా వీసాల జారీలో ఆలస్యంపైనా ఆ దేశ నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో చర్చించినట్టు జైశంకర్ వెల్లడించారు. "వీసాల జారీకి 400 రోజుల సమయం చాలా తీవ్రమైన విషయం. ఇది ఇరు దేశాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాదు వాణిజ్యం, పర్యాటక రంగం మాత్రమే కాకుండా ద్వైపాక్షిక ప్రయోజనాలూ దెబ్బతింటాయి" అని జైశంకర్ చెప్పారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో జైశంకర్
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్.. భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తంది. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ కావడమే అందుకు ఉదాహరణ. రూబియోతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్జ్‌తోనూ జైశంకర్ చర్చలు నిర్వహించారు.





















