అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసులపై దేశంలో ఉన్న ఆంక్షలను 2021 ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్గో సేవలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి కేంద్రం పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోనందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ లేఖను విడుదల చేసింది.
ఆ విమానలకు ఓకే..
అయితే కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రం అనుమతించిన విమానాల రాకపోకలను ప్రాధాన్య క్రమంలో అధికారుల అనుమతితో నడపవచ్చని డీజీసీఏ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపివేసింది.
అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని విదేశీ విమాన సర్వీసులను కొనసాగిస్తోంది. కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత సుమారు 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
గతేడాది కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత మే 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి. కానీ, గత 16 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది.
విజృంభిస్తోన్న కొవిడ్..
దేశంలో క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా రోజువారి కేసులు 40 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరించింది.