Sanjay Singh On BJP: కేజ్రీవాల్ కరెన్సీ కామెంట్స్‌పై ఆప్, భాజపా మధ్య మాటల మంటలు
Sanjay Singh On BJP: కేజ్రీవాల్ కరెన్సీ కామెంట్స్‌పై భాజపా, ఆప్ మధ్య వాగ్వాదం నడుస్తోంది.
Sanjay Singh On BJP:
భాజపాకు ఎందుకంత కడుపుమంట: సంజయ్ సింగ్
ఇండియన్ కరెన్సీపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలూ ముద్రించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. భాజపా, ఆప్ మధ్య మాటల యుద్ధానికీ కారణమయ్యాయి. కేజ్రీవాల్ కామెంట్స్‌పై భాజపా సీనియర్ నేత షహనవాజ్ హుస్సేన్ స్పందించారు. ఒకప్పుడు గాంధీజీ ఫోటోలను తొలగించిన వాళ్లు ఇప్పుడు దేవుళ్ల బొమ్మల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. మరో భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా కేజ్రీవాల్‌పై మండి పడ్డారు. "ఒకప్పుడు హిందూ దేవుళ్లు, దేవతలను అపహాస్యం చేసిన కేజ్రీవాల్ ఉన్నట్టుండి హిందువుగా మారిపోయారు" అంటూ విమర్శించారు. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లనని అప్పట్లో ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు. భాజపా విమర్శలపై ఆప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు "కేజ్రీవాల్ సూచనపై భాజపాకు అంత కడుపు మంట ఎందుకు..? ఆయన దేశం మేలు కోరే కదా అలాంటి సలహా ఇచ్చింది" అని వెల్లడించారు సంజయ్ సింగ్. "ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి కష్టకాలంలో మనం కలిసికట్టుగా పని చేయాలి. సమస్యను పరిష్కరించుకోవాలి. వీటితో పాటు దేవుళ్ల ఆశీర్వాదమూ అవసరమే. ఇప్పటి నుంచి ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలనూ ముద్రించాలి. భాజపా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావట్లేదు. ప్రధాని మోదీ కూడా స్పందించి అందుకు అంగీకరిస్తారో లేదో సమాధానం చెప్పాలి" అని అన్నారు సంజయ్ సింగ్.
ఇదీ వివాదం..
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి సూచించారు. లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు మన కరెన్సీపై ఉంటే దేశం ఇంకా సంపన్నమవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ బొమ్మ పక్కనే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలూ ముద్రించాలని సూచించారు. "ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు మన కరెన్సీపై ఉంటే తప్పేంటి. ఈ విషయమై కేంద్రానికి రెండ్రోజుల్లో లేఖ రాస్తాను. ప్రస్తుత మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే" అని వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.
I appeal to the central govt & the PM to put the photo of Shri Ganesh Ji & Shri Laxmi Ji, along with Gandhi Ji's photo on our fresh currency notes, says Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/t0AWliDn75
— ANI (@ANI) October 26, 2022
Also Read: TS BJP : చేరగానే పండగ కాదు - సర్దుకుపోవడమే సవాల్ ! తెలంగాణ బీజేపీలో వలస నేతలు ఎందుకు ఉండలేకపోతున్నారు ?